Dr. P.V. Ramesh | ప్రజలను మభ్య పెడుతున్న ప్రభుత్వం

Dr. P.V. Ramesh | ప్రజలను మభ్య పెడుతున్న ప్రభుత్వం

  • అవాస్తవాల బడ్జెట్ రూపకల్పన
  • రిటైర్డ్ ఐఏఎస్ డా పి.వి. రమేష్

Dr. P.V. Ramesh | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజా సంక్షేమం, అభివృద్ధిలను విస్మరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అవాస్తవాలతో ప్రజలను మభ్యపెడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరి డా పి.వి.రమేష్ పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీ విజయవాడలోని దాసరి భవన్ లో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.

ప్రధాన వక్తగా పాల్గొన్న డా పి.వి.రమేష్ ప్రసంగిస్తూ బడ్జెట్ లో పేర్కొన్న కేటాయింపులకు వాస్తవిక వ్యయాలకు పొంతన ఉండటం లేదని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలుగా కేవలం 5 శాతం మాత్రమే రాష్ట్ర ఆదాయము పెరుగుతూ 88 వేల కోట్లకు చేరిన రాష్ట్ర ఆదాయం నేటి బడ్జెట్ లో పేర్కొనట్లు లక్ష 25 వేల కోట్లకు ఎలా చేరుతుందని ప్రశ్నించారు. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రూపాలలో గణనీయంగా అప్పులు చేస్తుందని, రాష్ట్ర అప్పులు దాదాపు 14 లక్షల కోట్లకు చేరి అప్పుల ఊబిలోకి ప్రవేశించిందని, నేటి బడ్జెట్ లో మరో లక్ష కోట్ల రూపాయల రుణాలను ఈ ఏడాది పొందాలని పేర్కొనడం సమంజసం కాదన్నారు.

Dr. P.V. Ramesh |

రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3 శాతానికి మించి అప్పులు చేయరాదని 16వ ఫైనాన్స్ కమిషన్ స్పష్టం చేసిందని, గతంలో ఇస్తున్న రెవెన్యూ లోటును నేడు భర్తీ చేయడం లేదని, ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వంపై 4 వేల కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు. మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ జి.ఎస్.ఆర్.కె.ఆర్. ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డల నిధి, 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ,ఎస్టీ, బీసీలకు వృద్ధాప్య పెన్షన్ అందిస్తామని పేర్కొని నేడు బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా వారిని మోసగించారన్నారు.

ఆర్భాటమైన ప్రచారాలతో వివిధ రకాల ఈవెంట్లతో కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణానికి 4 వేల కోట్లు కేటాయించలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. వైయస్సార్ సిపి సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వేలాది కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉండగా నేటి బడ్జెట్ లో అరకొరగా కేటాయింపులు ఉన్నాయని, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే విధంగా బడ్జెట్ రూప కల్పన జరగలేదని విమర్శించారు.

గత 20 నెలలుగా 3.30 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ప్రభుత్వం మరో లక్ష కోట్ల రూపాయల అప్పులను ప్రతిపాదించిందన్నారు. జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పడిపోతున్న స్థితిలో ధరల స్థిరీకరణ నిధి కోసం కేవలం 5 వందల కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. 4 వేల కోట్ల రూపాయలతో 4 లక్షల ఎకరాలకు నీరు అందించే వెలుగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించడం దురదృష్టకరమన్నారు.

1970 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్సైజ్ ఆదాయం కేవలం 50 కోట్లు మాత్రమే ఉండేదని, నేడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఎక్సైజ్ ఆదాయం 30 వేల కోట్లు రాబట్టాలని నేడు బడ్జెట్ లో పేర్కొన్నారని, ప్రజలు మద్యం తాగి తులుతూ ఉంటే ప్రభుత్వాలను నడపాలని భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలి మాజీ సభ్యులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె.ఎస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ నేటి బడ్జెట్ సమ్మిళత వృద్ధికి, అసమానతల తగ్గింపుకు తోడ్పడే విధంగా లేదని, 60 శాతం ప్రజలు ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత దక్కలేదని, మానవాభివృద్ధికి దోహద పడడం లేదని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రైతాంగంలో 70 శాతం పైగా కౌలు రైతులు ఉన్నారని వారికి భద్రత కలిగించే చట్ట రూపకల్పనలో నేటి ప్రభుత్వం విఫలం అయిందని, కౌలు రైతులకు సంక్షేమం కోసం బడ్జెట్ లో కేటాయింపులు లేవని పేర్కొన్నారు. రిటైర్డ్ ఐ ఆర్ ఎస్ అధికారి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవీ ప్రసాద్ ప్రసంగిస్తూ రాష్ట్ర బడ్జెట్ అప్పుల కుప్ప, అబద్ధాల దిబ్బలా ఉందని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని విమర్శించారు. అభివృద్ధి అంటే రంగుల గోడలు, అద్దాల మేడలు కావని, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కృషి జరగాలన్నారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. రాంభూపాల్ ప్రసంగిస్తూ 38 శాతం వ్యవసాయ భూమి గల రాయలసీమలో కేవలం 8 శాతం భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయని, ఆ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసే విధంగా నేటి బడ్జెట్ లో కేటాయింపులు లేవన్నారు. బడ్జెట్ ప్రసంగం అంతా గత ప్రభుత్వం పై విమర్శలు, నేటి ప్రభుత్వ పాలకులపై పొగడ్తలతో కొనసాగిందన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు వినయ్ కుమార్, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Leave a Reply