ఆ చిన్నారి కోలుకుంది..
- వైరస్ ప్రచారం తప్పు
- పెనుగంచిప్రోలులో ..
- వీధి వీధిలో ఎన్టీఆర్ కలెక్టర్ తనిఖీ
- తాగునీటి సరఫరా.. పారిశుధ్యంపై నజర్
ఆంధ్రప్రభ, పెనుగంచిప్రోలు : వైరల్ సోకడంతో చికిత్స తీసుకొన్న చిన్నారి పూర్తిగా కోలుకుందని, గ్రామంలో ఎక్కడా మరో కేసు నమోదు కాలేదని, ప్రజల ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు.
మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ , వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో కలిసి పెనుగంచిప్రోలులో మూడు గంటలపాటు పర్యటించారు. తొలుత చికిత్సతో వైరల్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్న చిన్నారి గీతా సహస్ర ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలతో మాట్లాడారు. స్థానికంగా మంచి నీటి సరఫరా వ్యవస్థను, ట్యాంకును పరిశీలించారు.
ఇంటింటి సర్వే…
పెనుగంచిప్రోలు గ్రామంలో ఇప్పటికే ప్రత్యేక బృందాలు రెండు రౌండ్ల ఇంటింటి సర్వేను పూర్తిచేశాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి శ తెలిపారు. వైద్యాధికారులు మరో 24 గంటలపాటు ఇక్కడ మరో ప్రత్యేక సర్వే నిర్వహిస్తారని తెలిపారు.
చిన్నచిన్న ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఏదైనా సమస్య వస్తే వెంటనే ఏఎన్ఎం, ఆశా సహకారంతో స్థానిక వైద్యాధికారులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. కొందరు చిన్న సమస్యలను సైతం తెలిసీ తెలియక అవగాహన లేమితో ప్రచారం చేస్తున్నారని.. దీనివల్ల ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారన్నారు.
సమర్థవంతంగా సేవలు…
ఎన్టీఆర్ జిల్లాలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సేవలందిస్తున్నారని.. ఎవరైనా సరిగా స్పందించకుంటే తమకు సమాచారమివ్వొచ్చని, అధికారుల బృందాన్ని నేరుగా ఇళ్లకే పంపిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి శ తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని.. ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు.
ప్రైవేటు ఖాళీ స్థలాల్లో ఇష్టానుసారం చెత్త వేయకుండా, కంపచెట్లు పెరగకుండా చూసేందుకు ఆయా స్థలాల యజమానులకు గ్రామపంచాయతీ ద్వారా నోటీసులు ఇస్తున్నామన్నారు. తాగునీటిని ఎప్పటి కప్పుడు పరీక్షించి ప్రజలకు అందించేలా నిర్దిష్ట మార్గదర్శకాలతో అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు.
