ప్రతిపక్షాలపై వెస్ట్ ఎమ్మెల్యే నాయిని ఫైర్

ప్రతిపక్షాలపై వెస్ట్ ఎమ్మెల్యే నాయిని ఫైర్
- భద్రకాళి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిద్ధితా
- భద్రకాళి చెరువు పూడికతీతకు శ్రీకారం
- రూ.16.10 కోట్లతో పనుల ప్రారంభం…
- అభివృద్ధిపై రాజకీయాలు చేయొద్దు
- వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ : ఓరుగల్లు ప్రజల ఇలావేల్పుగా విరాజిల్లుతున్న భద్రకాళీ ఆలయాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకు రావడంతో పాటు అదే స్థాయిలో భక్తులు వచ్చి దర్శించుకునేల ఆలయాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.భద్రకాళి చెరువు సుందరీకరణలో భాగంగా ఆలయం నుంచి బండ్ వైపు గ్లాస్ వంతెన ఏర్పాటు చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.సమిష్టి నాయకత్వంతో వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి సుందరీకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, నగర మేయర్ గుండు సుధారాణిలతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.వరంగల్ నగర అభివృద్ధిలో కీలకమైన భద్రకాళి చెరువు పునరుద్ధరణకు మరోసారి శ్రీకారం చుట్టామని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. గతంలో రూ.9 కోట్లతో ప్రారంభించిన పూడికతీత పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో ఇప్పుడు మరో రూ.16.10 కోట్ల నిధులతో సమగ్రంగా చెరువు పూడికతీత పనులను చేపడుతున్నామని చెప్పారు.

భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో ఎలాంటి అంతరాయాలు లేకుండా చెరువు పునరుద్ధరణ, మాడ విధుల పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా ఓటు బ్యాంకు రాజకీయాలు చూడలేదని ఆయన స్పష్టం చేశారు.ప్రతిపక్ష పార్టీల నేతలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే తమకు చెడ్డపేరు వస్తుందనే భయంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. గత పాలకులు అమ్మవారి పేరును రాజకీయ లబ్ధికి వినియోగించుకున్నారని ఎత్తి చూపారు.

తమ అనుచరులకు ఆలయ పరిసరాల్లో వ్యాపార సంస్థలు ఇచ్చి రేట్లు పెంచి ప్రజలకు భారంగా మార్చారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు.గతంలో 70 ఏళ్ల క్రింద పూడికతీత జరిగిన చెరువును నేడు మళ్లీ తమ హయాంలో జరగడం చాలా సంతోషంగా ఉందనన్నారు. భద్రకాళీ ఆలయాన్ని అన్నీ రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉద్ఘాటించారు.
