‘ఆరంభరహతుఁ బొందునెయారయ సంపదలు?’ అన్నాడు ఆదికవి నన్నయ ఆంధ్ర మహాభారతం, సభాపర్వం, ప్రథమాశ్వాసంలోని పద్యంలో. సాధించవలసిన కార్యాన్ని మొదలుపెట్టడానికి జంకేవాడు ‘ఆరంభ రహితుడు’. మానవప్రయత్నం చేయని వ్యక్తి ఏ ప్రయోజనమైనా పొందడానికి అర్హుడు కాడు. ఏ పనికైనా మంచి ఆరంభలో సగం సఫలత దాగి ఉంటుందన్నది మానవాళికి అనుభవం తెలియజేసిన సత్యం. అయితే ఆరంభంలో, ‘తత్తర మొప్పదు పనియెడ’ అనికూచిమంచి తిమ్మకవి, ‘శివలీలా విలాసము’కావ్యంలో చెప్పినట్లుగా, ఏ పని గురించైనా తొందరపడి తప్పులు చేయడం వలన అసలుకే మోసం వస్తుంది. కనుక, చేయవలసిన పనిని గురించి ముందుగానే బాగా ఆలోచించి, ఆ పనిని చేసేటప్పుడు కంగారును, తొట్రుపాటును ప్రదర్శించకుండా చేసేవాడే తెలివైన కార్యసాధకుడు. అలాంటి వానినే లక్ష్మీదేవి తన మనసులో మెచ్చుకుని ఆదరిస్తుంది అని అందులో భావం. ‘సకల యత్నంబుల నుత్సాహంబె మనుజులకు సకలార్థ మూలము’ అని ‘రంగనాథ రామయాణం’ చెప్పింది. అన్ని ప్రయత్నాలలోనూ, పొందదలచిన ఫలితానికి సరిపోయే ఉత్సాహంతో పనిచేసినప్పుడు మాత్రమే మనుషులకు సంపద చేకూరుతుందని ఆ మాటల తాత్పర్యం. అయితే, అన్ని సమయాలలోను శ్రమశక్తి మీద, శరీర బలం మీద ఆధారపడడం వలన పూర్తి ప్రయోజనం సాధించలేము కాబట్టి ‘బలిమిఁ జేయరాని పని యెట్టిదైన, నుపాయ బలముచేతఁ జేయవచ్చు’ అన్నాడు చరిగొండ ధర్మన ‘చిత్రభారతము’ కావ్యంలో. తలపెట్టిన పనిని సఫలవంతం చేయడానికి సరిపోయేంతగా బుద్ధి బలం కూడా ప్రయోగించాలిఅని ఆ మాటల అర్థం. అయితే, అన్ని జాగ్రత్తలూ తీసుకుని మానవ ప్రయత్నం ఎంత పకట్బందీగా చెసినప్పటికీ దైవం ఆ ప్రయత్నానికి తోడుగా లేకపోతే ఆశించిన ఫలితం దక్కదని ఆంధ్ర మహాభారతం, అనుశాసనిక పర్వంలో తిక్కన ‘విత్తు సహకారి గాకున్న రిత్తనేలవంద్య మగుఁ గాక, తా ఫలవంతమగునె?’ అన్న మాటలలో ‘విత్తనం యొక్క తోడ్పాటు లేకుండా వొట్టి నేల ఏమి చేయగలదు, బీడుభూమిగా మిగిలిపోతుంది కదా. కనుక, పురుషయత్నానికి దైవసహాయం కూడా తోడైనప్పుడే పూర్తి సఫలత చేకూరుతుంది!’ అని అర్థవంతమైన ఉదాహరణతో చెప్పాడు. చివరగా, తనకు లభ్యం కావేమోనని అనిపించే సఫలతలు సైతం, పట్టు వదలక పదే పదే ప్రయత్నం చేయడం వలన, సమకూరే అవకాశం ఉంటుందన్న అర్థంలో ‘చెందంగరాని వస్తువులందునుయత్నమ్ము సేయ నవి సిద్ధముగాఁజెందుం గావునఁ’ వివేకి అయినవాడు తన ప్రయత్నం ఎన్నటికీ మానడుఅన్నాడు జక్కరాజు వెంకటకవి ‘ఆంధ్ర కామందకము’ తృతీయాశ్వాసంలోని పద్యంలో. ఇలా, కార్యసాధకులకు సూచనలుగా, తాము రచించిన కావ్యాలలో, సందర్భాన్ని బట్టి తేలికగా అర్థమయ్యే మాటలలో, ఛందోబద్ధమైన పద్యాలలో స్మరణీయాలైన మంచి సూచనలను తెలుగు కవులు పొందుపరిచి చెప్పారు.
- భట్టు వెంకటరావు