Documentation | ప్రజల సంతృప్తి ఏమిటీ?..

Documentation | ప్రజల సంతృప్తి ఏమిటీ?..

  • అంగన్వాడి, ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాల, రేషన్ దుకాణాల్లో ప్రజల అసంతృప్తి?..
  • స్వర్ణాంధ్ర-స్వచ్ఛఆంధ్ర, ఐగాట్ కర్మయోగి, డాక్యుమెంటేషన్ అప్లోడ్‌ ఎక్కడ?..
  • జిల్లా కలెక్టర్ సమీక్ష…

Documentation | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచే దిశగా అధికారులు సమగ్రంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాలులో పబ్లిక్ పర్సెప్షన్, స్వర్ణాంధ్ర-స్వచ్ఛఆంధ్ర, డాక్యుమెంటేషన్ అప్లోడ్, ఐగాట్ కర్మయోగి, అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ తదితర అంశాలపై జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి. రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ శాఖలకు కేటాయించిన పారామీటర్లలో ప్రజల సంతృప్తి శాతం తక్కువగా ఉన్న అంశాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలన్నారు. అన్న క్యాంటీన్లలో పరిశుభ్రత పాటిస్తూ సమయానికి నాణ్యమైన భోజనం, త్రాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. ప్రతి పారామీటర్‌కు ప్రభుత్వం మార్కులు కేటాయించిన నేపథ్యంలో ఏ అంశంలోనూ నిర్లక్ష్యం చేయకుండా నిరంతర పర్యవేక్షణ ద్వారా అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు.

జిల్లాలోని 12 బీసీ సంక్షేమ వసతి గృహాలు, 9 సోషల్ వెల్ఫేర్ వసతి గృహాల్లో కేటాయించిన 15 పారామీటర్లలో మెరుగుదల తీసుకువస్తే విద్యార్థుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుందన్నారు. వసతిగృహాల్లో మెరుగైన వసతులతో పాటు విద్యార్థులకు సమయానికి వేడి భోజనం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలు, 35 ప్రభుత్వ ఆసుపత్రులు, 28 పాఠశాలలు, 41 రేషన్ దుకాణాలు, 13 బస్ స్టేషన్లలో ప్రజల సంతృప్తి తక్కువగా ఉన్నట్లు నివేదికలు వెల్లడించినందున సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

Documentation | స్వర్ణాంధ్ర–స్వచ్ఛఆంధ్రపై ప్రత్యేక దృష్టి…

స్వర్ణాంధ్ర–స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల “జీరో లిట్ఠర్ గవర్నెన్స్” పరిశుభ్రత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి కార్యాలయంలో 2026 సంవత్సరానికి సంబంధించి మాసానుసార నినాదాలను బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. కార్యాలయ ప్రాంగణాల్లో కంపోస్ట్ పిట్లు త్రవ్వడం, డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయడం, వ్యర్థాలను వినియోగదాయక వస్తువులుగా మార్చే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆత్మకూరు, బనగానపల్లె, నంద్యాల బస్ స్టేషన్ల నిర్వహణ సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ ఇచ్చి, ఈ-హెల్త్ సేవలపై దృష్టి సారించాలని సూచించారు. రైతు బజార్లలో పరిశుభ్రత పాటిస్తూ కంపోస్ట్ పిట్లు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీల్లో గుంతల రహిత రహదారులు ఉండేలా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు. ఈనెల 21వ తేదీన స్వర్ణాంధ్ర–స్వచ్ఛఆంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Documentation | ఐగాట్ కర్మయోగి కోర్సులు, ఈ-డాక్యుమెంటేషన్‌ అప్ లోడ్ పై చర్యలు తీసుకోండి…

జిల్లా లోని ఐగాట్ కర్మయోగి ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న కోర్సులను ప్రతి ఉద్యోగి పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సిఎఫ్‌ఎంఎస్ ఐడి కలిగిన ప్రతి ఉద్యోగి కనీసం 40 కోర్సులు పూర్తి చేయాలని, లేకపోతే వార్షిక ఇంక్రిమెంట్లను నిలిపివేసే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదేశించారు. ఈపిటిఎస్‌కు సంబంధించిన ప్రతి దస్త్రాన్ని ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల్లో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లలో పురోగతి సాధించేలా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply