DMK Mind Game | చక్రవ్యూహం Andhra Prabha Analysis

DMK Mind Game | చక్రవ్యూహం Andhra Prabha Analysis
DMK Mind Game | గేమ్ చేంజర్ విజయ్ దూకుడు
యువతపై ఫోకస్
దళపతి ఇల్లాలి పంచాయితీ
సంక్షోభంలో ఏఐడీఎంకే
పళని స్వామికి అగ్ని పరీక్ష
శశికళ పంతం – కులగూర గంపకు చిల్లు
బీజేపీ సంధి ఆరాటం
తమిళనాడు పొలిటికల్ హీట్
DMK Mind Game | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : భారతావని ఉత్తరాదిలో పుట్టన జాతీయ రాజకీయ పార్టీలకు కొరకరాని కొయ్యగా మారిన తమిళనాడులో.. వేసవికి ముందే పొలిటికల్ హీట్ రాజుకుంది. ఇప్పటి వరకూ అంటే ఆరు దశాబ్దాలుగా కేవలం రెండు ద్రవిడ పార్టీలే నువ్వానేనా అని తమిళనాడును పాలిస్తుంటే.. తాజాగా మరో రెండు పార్టీలు తెరంగేట్రం చేశాయి. సినీ స్లార్ విజయ్ టీవీకే పార్టీ దళపతిగా అవరించారు.
ఇక మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కూడా తన ప్రతానాన్ని చూపించేందుకు కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో.. కొత్త రాజకీయ సమీకరణలు తమిళ తంబీలను పలకరిస్తున్నాయి. ప్రధాన ప్రత్యర్థి అన్నా డీఎంకేను నిర్వీర్యం చేసే వ్యూహంలో డీఎంకే అధినేత స్టాలిన్ ఒక అడుగు ముందుకు వేస్తే.. ఏఐడీఎంకే తాజా అధినేత పళని స్వామి సంగతి తేల్చేందుకు తమిళ నాయకురాలు నాగమ్మ శశికళ సర్వసన్నద్ధం అవుతోంది.
ఇక తరతరాల రాజకీయాలకు చరమాంకం పాడేందుకు నవతరం యువతను తమిళగ వెట్రి కళగం ఆకర్షిస్తున్న సమయంలో.. తాజాగా ఇల్లాలు కుంపటి సెగ తమిళనాట ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇక 20 ఏళ్ల తరువాత ఏఐడీఎంకే ప్రసాదంతో 4 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టిన బీజేపీ తాజా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సరిరొత్త కులగూర గంపను సృష్టించే యాగంలో తలమునకలవుతోంది. ఇలా. తమిళనాట పంచ భూతాల రాజకీయకేళిలో మంత్రాంగం, తంత్రాంగం స్థితి గతి పరిశీలిద్దాం.
DMK Mind Game : ఢీ..ఎంకే మైండ్ గేమ్

జయలలితకు అత్యంత సన్నిహితుడు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ. పన్నీర్‌సెల్వం (OPS) తన కుమారుడు రవీంద్రనాథ్ ను డీఎంకే అధినే ఎం.కె. స్టాలిన్ తమ మాతృసంస్థలోకి లోకి సాదరంగా ఆహ్వానించారు. తండ్రి కొడుకులిద్దరూ ఫిబ్రవరి 27న డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఇంకేముందీ, ఏఐడీఎంకే దుర్భేధ్య కోట దక్షిణ తమిళనాడులో తేవార్ సామాజిక వర్గ ఓట్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా డీఎంకే ఈ ఎత్తుగడ వేసింది.

జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తూ.. బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్న డీఎంకే.. తాజాగా సొంతింటిలోని ప్రత్యర్థి బలాన్నీ నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమైంది. గత కొన్ని ఏళ్లుగా ఢిల్లీలోని బీజేపీ అగ్రనాయకత్వానికి తమిళనాడు క్షేత్ర స్థాయి రాజకీయాలకు మధ్య ఓ పన్నార్ సెల్వన్ ఒక వారధిగా నిలిచారు. బీజేపీ మాట వినే ఏకైక పెద్ద నేత ఆయనే. ఇప్పుడు డీఎంకేలో చేరడంతో, బీజేపీకి ఒక నమ్మక మిత్రుడిని బీజేపీ కోల్పోయింది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో ఓపీఎస్ సామాజిక వర్గం (తేవార్) మద్దతు బీజేపీకి దూరమైంది.

ఇక చిరకాల ప్రత్యర్థి ఏఐడీఎంకే పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఇలా డీఎంకే అధినేత స్టాలిన్.. తన సరికొత్త రాజకీయ మంత్రాంగంతో ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని తోలేశారు. ఇక మిగిలింది.. టీవీకే దళపతి విజయ్.. మాస్ ఇమేజీకి క్లీన్ ఇమేజీ ప్రశ్న సంధించారు. ప్రత్యర్థుల బలాన్ని, బలగాన్ని దెబ్బతీయటానికి అకస్మిక వ్యూహాలను తెరమీదకు తీసుకు వస్తున్నారు.
DMK Mind Game : టీవీకే దళపతి దూకుడు

తమిళగ వెట్రి కళగం (TVK) దళపతి విజయ్ తన రాజకీయ పరుగులో దూకుడు పెంచారు. స్వతంత్రంగానే పోటీ చేస్తామని చెబుతున్నారు. వేలూరు ర్యాలీలో ఇటీవల విజయ్ మాట్లాడుతూ.. ఈ పోరాటం “తమిళనాడు వర్సెస్ ఢిల్లీష కాదు, నేరుగా “టీవీకే వర్సెస్ డీఎంకే” అని ప్రకటించి సంచలనం సృష్టించారు. యువజనం, మార్పు కోరుకునే ఓటర్లపై టీవీకే దృష్టి పెట్టింది. పాత తరం రాజకీయాలకు భిన్నంగా, సరికొత్త విధానాలతో విజయ్ జనంలోకి దూసుకు పోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును, తటస్థ ఓటర్లను ఆకట్టుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
దళపతి విజయ్ ఇప్పటివరకు కేవలం ‘సినిమా మాస్ హీరో’ మాత్రమే. కానీ ఇప్పుడు ఆయన ‘పొలిటికల్ మాస్ లీడర్’ అనే సరికొత్త ఇమేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. కేవలం డీఎంకే మాత్రమే తమిళ వారసత్వాన్ని కాపాడగలదు అనే వాదనను విజయ్ బద్దలు కొడుతున్నారు. ‘సెక్యులర్ సోషల్ జస్టిస్’ (లౌకిక సామాజిక న్యాయం) అనే సిద్ధాంతాన్ని ఎంచుకుని, తనను తాను ఒక బాధ్యతాయుత రాష్ట్ర నాయకుడిగా మలుచుకుంటున్నారు. 2026 ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయబోయే లక్షలాది మంది యువతకు విజయ్ ఒక ‘రోల్ మోడల్’గా కనిపిస్తున్నారు.
క్లీన్ ఇమేజ్‌తో వస్తున్న నాయకుడిగా ఆయనకు ఇమేజ్ పెరుగుతోంది. దళపతి విజయ్ మేనిఫెస్టోలో మహిళా సాధికారత, విద్యా రంగంపై శ్రద్ధ వల్ల, కేవలం మాస్ ఆడియన్సే కాకుండా మధ్యతరగతి కుటుంబాలు, మహిళలు కూడా ఆయనను తమ సొంత మనిషిగా చూడటం మొదలుపెట్టారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ఎంట్రీ, ఓపీఎస్ డీఎంకేలో చేరిక పరిణామాల మధ్య విజయ్ తన ‘మాస్ ఇమేజ్’ను ‘ఓట్లు’గా ఎలా మారుస్తారనేది ఇప్పుడు అందరినీ వేధించే ప్రశ్న.
DMK Mind Game : గేమ్ చేంజర్ ఇల్లాలి పంచాయితీ

టీవీకే అధినేత విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయ్‌కు ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం ఉందని సంగీత తన 12 పేజీల విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఏప్రిల్ 2021లోనే గుర్తించినట్లు ఆమె ఆరోపించారు.
ఆ నటితో సంబంధాన్ని తెంచుకుంటానని విజయ్ హామీ ఇచ్చినప్పటికీ, ఆయన కొనసాగించారని, ఇది తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు.
ఆ నటి విజయ్‌తో కలిసి విదేశీ పర్యటనలు చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు, విజయ్ వాటిని ఖండించలేదని, ఇది తనకు తన పిల్లలకు బహిరంగంగా అవమానకరంగా మారిందని సంగీత ఆరోపించారు. విజయ్ తనను సామాజిక, వృత్తిపర కార్యక్రమాలకు దూరం చేశారని, ఆర్థిక ఆంక్షలు విధించారని, తమ మధ్య దాంపత్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయని ఆమె పిటిషన్‌లో వివరించారు. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఏప్రిల్ 20, 2026న వ్యక్తిగతంగా హాజరుకావాలని విజయ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది.
DMK Mind Game : అభిమానుల్లో అంతర్మథనం

విజయ్ తన రాజకీయ జీవితాన్ని (2026 ఎన్నికలు) ప్రారంభించిన కీలక సమయంలో ఈ వివాదం బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. సినిమా నటుడిగా భారీ ఫాలోయింగ్ ఉన్న విజయ్, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా (TVK అధినేతగా) తనను తాను నిరూపించుకోవాల్సిన తరుణంలో ఈ విడాకుల వివాదం ఖచ్చితంగా ఒక సవాల్ గా మారింది. తమిళనాడు రాజకీయాల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలకం.
గతంలో ఎంజీఆర్, జయలలిత వంటి నేతలకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఒకవేళ ఈ వివాదం కోర్టులో ముదిరి, సంగీత ఆరోపణలు నిజమని ప్రజలు భావిస్తే, మహిళా ఓటర్లలో విజయ్ పట్ల ‘నమ్మదగ్గ వ్యక్తి’ అనే ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎప్పుడూ లూప్‌హోల్స్ కోసం వెతుకుతుంటారు. డీఎంకే, ఏఐడీఎంకే వంటి ప్రత్యర్థులు నేరుగా విమర్శించకపోయినా, సోషల్ మీడియా వేదికగా “సొంత కుటుంబాన్ని చక్కదిద్దుకోలేని వాడు, రాష్ట్రాన్ని ఎలా ఏలుతాడు?” అనే ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశం ఉంది.

విజయ్‌కు ఉన్న అతిపెద్ద బలం ఆయన అభిమాన గణం. అభిమానులు సాధారణంగా ఇలాంటి వ్యక్తిగత విషయాలను పట్టించుకోరు. విజయ్‌ను ఒక నాయకుడిగా మాత్రమే చూస్తారు. కాబట్టి యువత ఓట్లు చీలే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. విజయ్ తన రాజకీయ ప్రసంగాల్లో “నీతి, నిజాయితీ, క్రమశిక్షణ” గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇలాంటి ‘క్లీన్ ఇమేజ్’ ఉన్న నాయకుడి వ్యక్తిగత జీవితంలో వివాదాలు రావడం ఆయన నైతికతపై ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తుంది.
దీనిని ఆయన ఎలా మేనేజ్ చేస్తారనే దానిపైనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. తమిళనాడు ప్రజలు సినిమా జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని వేరుగా చూస్తారా? లేదా ఒక ‘రోల్ మోడల్’ నాయకుడిని కోరుకుంటారా? అన్నది 2026 ఎన్నికలే తేల్చాలి. ఇక టీవీకే అధినేత విజయ్ పై వ్యక్తిగత జీవితం పై దుమారాన్ని కాసేపు పక్కన పెడితే..
DMK Mind Game : పాపం పళని స్వామీ..

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఏఐడీఎంకే (AIADMK) గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఓపీఎస్ డీఎంకేలోకి వెళ్లడం, శశికళ కొత్త పార్టీ ప్రకటించడం వల్ల ఈపీఎస్ (EPS) నాయకత్వంలోని ఏఐడీఎంకే అల్లాడి తల్లడిల్లిపోతోంది. ఎందుకంటే.. ఏఐడీఎంకే ఓటు బ్యాంకుకు చిల్లుపడుతోంది. శశికళ, ఓపీఎస్ ఇద్దరూ తేవార్ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలు.
ఓపీఎస్ డీఎంకేలో చేరడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. శశికళ కొత్త పార్టీ పెడితే, ఏఐడీఎంకే సంప్రదాయ ఓట్లు (ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో) ఆమె వైపు మళ్లే ప్రమాదం ఉంది. క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఇది ఎన్నికల సమయంలో బూత్ లెవల్ మేనేజ్‌మెంట్‌పై ప్రభావం చూపుతుంది.
DMK Mind Game : బీజేపీతో జత తప్పదా?

ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐడీఎంకేకు బీజేపీతో పొత్తు “అనివార్యం” అనే వాదన వినిపిస్తోంది. ఓపీఎస్, శశికళ, టీటీవీ దినకరన్ దూరమయ్యారు, ఈపీఎస్ ఒంటరిగా డీఎంకే కూటమిని ఎదుర్కోవడం కష్టతరం. డీఎంకేకు వ్యతిరేకంగా ఒక బలమైన కూటమి కట్టాలంటే బీజేపీ వంటి జాతీయ పార్టీ అండ అవసరం. దీనివల్ల నిధులు, కేంద్ర స్థాయి మద్దతు లభిస్తాయి.
ఒకవేళ బీజేపీ, విజయ్ కలిస్తే.. ఏఐడీఎంకే మూడో స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది. అది జరగకూడదంటే ఈపీఎస్ మళ్లీ బీజేపీతో రాజీ పడక తప్పదు. బీజేపీతో కలిస్తే మైనారిటీ ఓట్లు దూరమవుతాయని ఈపీఎస్ భయం. అందుకే ఆయన ఇప్పటివరకు పొత్తుపై స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఫిబ్రవరి 2026 నాటి తాజా పరిణామాలు చూస్తుంటే, డీఎంకేను ఢీకొట్టడానికి “బీజేపీ + ఏఐడీఎంకే” కలవక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
DMK Mind Game : శశికళ పంతం

శశికళ (చిన్నమ్మ) ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో తమిళనాడు సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయంగా ఎడప్పాడి పళనిస్వామి (EPS). చిన్నమ్మకు ప్రధాన శత్రువు. ఆమె జైలుకు వెళ్ళే ముందు ఈపీఎస్‍ను ముఖ్యమంత్రిని చేశారు. కానీ, ఆయనే ఆమెను పార్టీ (AIADMK) నుండి బహిష్కరించి, పార్టీ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారు.
ఇప్పుడు ఆమె పార్టీని మళ్ళీ దక్కించుకోవడమో లేదా ఈపీఎస్‌ను ఓడించడమో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. శశికళ రాక వల్ల డీఎంకే కి పరోక్షంగా రాజకీయ లబ్ధి చేకూరుతుంది, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం ఏఐడీఎంకే మరింత బలహీనపడుతుంది. తమిళనాడులోని అత్యంత శక్తివంతమైన తేవార్ సామాజిక వర్గం ఓట్లపై ప్రభావం చూపుతుంది.
ముక్కులతోర్ (తేవార్): శశికళ స్వయంగా ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దక్షిణ, మధ్య తమిళనాడులోని సుమారు 40-50 నియోజకవర్గాల్లో ఈ వర్గం ఓట్లు గెలుపోటములను శాసిస్తాయి. దశాబ్దాలుగా తేవార్ సామాజిక వర్గం ఏఐడీఎంకేకు వెన్నెముకగా ఉంది. ఇప్పుడు శశికళ రంగంలోకి దిగడంతో, ఈ ఓట్లు ఏఐడీఎంకే (ఈపీఎస్ వర్గం) , శశికళ కొత్త పార్టీ మధ్య చీలిపోయే ప్రమాదం ఉంది.
DMK Mind Game : బీజేపీ సంధి ఆరాటం

ఇటు డీఎంకే అధినేత స్టాలిన్ మైండ్ గేమ్.. అటు గేమ్ చేంజర్ టీవీకే దళపతి విజయ్ దెబ్బతో… జాతీయ పార్టీ బీజేపీ బావురు మంటోంది. 2021 అసెంబ్లీ ఎన్నికలలో ఏఐడీఎంకేతో జతకట్టి 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అసెంబ్లీలో ప్రస్తుతం అసెంబ్లీలో వానతి శ్రీనివాసన్ (కోయంబత్తూర్ సౌత్), నైనార్ నాగేంద్రన్ (తిరునెల్వేలి) కలిపి మొత్తం 4 గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోయే 2026 ఎన్నికల్లో 20 నుండి 30 స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ ప్రకటించారు.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గెలిచే అవకాశం ఉన్న 65 స్థానాలను బీజేపీ గుర్తించింది.
ఆ స్థానాల్లో ప్రత్యేక దృష్టి సారించింది. డీఎంకే ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని, ఏఐడీఎంకే బలహీనపడిన చోట తమ ముద్ర వేయాలని బీజేపీ భావిస్తోంది. కానీ కథ అడ్డం తిరిగింది. బీజేపీకి పెద్ద దెబ్బ తగిలింది. ఏఐడీఎంకే నేత పన్నీర్ సెల్వం డీఎంకే గోడ దూకేశాడు. ఏఐడీఎంకే, బీజేపీతో పొత్తు ఉండబోదని ఏఐడీఎంకే ఛీప్ పళని స్వామి కరాఖండీగా చెబుతున్నారు. బీజేపీతో కలిస్తే మైనారిటీ ఓట్లు రావట్లేదు” అనేది ఈపీఎస్ గట్టి నమ్మకం. ఈ స్థితిలో బలమైన కూటమి లేకపోతే, తమిళనాడులో బీజేపీ ఒంటరిగా గెలవడం చాలా కష్టం.

శశికళ సొంత పార్టీ పెట్టడం వల్ల ఏఐడీఎంకే ఓట్లు చీలుతాయి. పోనీ ఆమెతో పొత్తు పెట్టుకుంటే పళని స్వామి మరింత దూరం అవుతారు. విజయ్ తన సిద్ధాంతాల్లో బీజేపీని విమర్శిస్తున్నారు. కాబట్టి ఆయనతో పొత్తు కూడా బీజేపీకి ప్రస్తుతానికి అసాధ్యంగానే కనిపిస్తోంది. పీఎంకే (PMK), ఎండీఎంకే వంటి చిన్న పార్టీలను, శశికళ వర్గాన్ని కలుపుకుని ఒక ‘మూడో కూటమి’ని నడిపించడం ఒక దారి కాగ, బీజేపీ ప్రస్తుతం ఒక క్లిష్టమైన సంధియుగంలో కొట్టిమిట్టాడుతోంది. ఉంది.
