District SP Tushar Dudi | పోలీస్ ఉద్యోగం.. ఓ బాధ్య‌త‌

District SP Tushar Dudi | పోలీస్ ఉద్యోగం.. ఓ బాధ్య‌త‌

  • జిల్లా ఎస్పీ తుషార్ డూడి

District SP Tushar Dudi | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : పోలీస్ ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని, బాధ్యతతో ప్రజలకు సేవ చేయాల‌ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి స్పష్టం చేశారు. చిత్తూరు పట్టణంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో 2025 బ్యాచ్ స్టైపెండరీ కేడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు నేటి నుంచి ప్రారంభమైన 9 నెలల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి 61 మంది, విజయనగరం జిల్లా నుంచి 78 మంది మొత్తం 139 మంది కేడెట్ ట్రైనీలు శిక్షణ నిమిత్తం చిత్తూరు జిల్లాకు చేరుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరికి 9 నెలల పాటు శారీరక దృఢత్వం, ఆయుధాల వినియోగం, డ్రిల్, చట్టాలపై అవగాహన, ప్రజలతో మమేకమయ్యే విధానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, పోలీస్ విధి బాధ్యతలపై సమగ్ర శిక్షణ అందించనున్నట్లు చెప్పారు.

శిక్షణ ప్రారంభం సందర్భంగా ట్రైనింగ్ సెంటర్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ట్రైనీ కానిస్టేబుళ్లతో సమావేశమైన ఎస్పీ, మారుతున్న నేర ధోరణులు, ఆధునిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని డీజీపీ కార్యాలయం నుంచి రూపొందించిన తాజా శిక్షణ పాఠ్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ 9 నెలల శిక్షణ భవిష్యత్ పోలీస్ జీవితానికి పునాది అని, దీనిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.

District SP Tushar Dudi

శిక్షణ కాలంలో క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత అత్యంత ముఖ్యమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి ట్రైనీ ఉత్తమ పోలీస్ కానిస్టేబుల్‌గా ఎదగాలంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా మారాలని, చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ బ్యాచ్ రాష్ట్రంలోనే ఉత్తమ ట్రైనీ బ్యాచ్‌గా నిలవాలని తన ఆకాంక్షగా తెలిపారు.

ఈ సందర్భంగా ట్రైనీ కానిస్టేబుళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఎస్పీ వెల్లడించారు. పోలీస్ విధుల్లో పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉండటం తప్పనిసరి అని, అందుకే శిక్షణ ప్రారంభంలోనే వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో అవుట్‌డోర్, ఇండోర్ శిక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రతి ట్రైనీకి నాణ్యమైన శిక్షణ అందేలా అధికారులకు ఇప్పటికే సూచనలు జారీ చేశామని తెలిపారు.

ట్రైనీలు ఎప్పుడూ ఫీల్డ్ డ్యూటీకి సిద్ధంగా ఉండాలని, లా అండ్ ఆర్డర్ సమస్యలు, వైద్య అత్యవసర పరిస్థితులు, వరదలు, విపత్తుల నిర్వహణ వంటి ఏ పరిస్థితి ఎదురైనా వెంటనే స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఎస్పీ సూచించారు. శిక్షణలో నేర్చుకునే ప్రతి అంశం భవిష్యత్‌లో ప్రజలకు సేవ చేయడంలో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. పోలీస్ శాఖకు ట్రైనీలు విలువైన ఆస్తులుగా మారాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గర్వకారణంగా నిలవాలని ఎస్పీ ఆకాంక్షించారు. క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథంతో శిక్షణను పూర్తి చేసి ప్రజల విశ్వాసాన్ని సంపాదించే పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్, ఇంచార్జ్ అడ్మిన్ ఎస్.ఆర్. రాజశేఖర రాజు, చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ టి.సాయినాథ్, జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ డీఎస్పీ జె. రాంబాబు, ఏఆర్ డీఎస్పీలు చిన్ని కృష్ణ, మహబూబ్ బాష, ట్రైనింగ్ సెంటర్ ఇన్‌స్పెక్ట‌ర్‌ అమర్నాథ్ రెడ్డి, ఆర్‌ఐలు చంద్రశేఖర్, వీరేశ్‌తో పాటు ఇండోర్, అవుట్‌డోర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply