Nandyala | రాజ్యాంగ పరిరక్షణ.. మనందరి బాధ్యత

Nandyala | రాజ్యాంగ పరిరక్షణ.. మనందరి బాధ్యత
డీఆర్ఓ రాము నాయక్
Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ పరిరక్షణ.. మన అందరి బాధ్యత అని, అందుకు ప్రతీ ఒక్కరూ తన వంతు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ (Ramu Naik) పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ.. దేశంలోని సాంస్కృతిక (Cultural), భాషల, తదితర వైవిధ్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నామని తెలిపారు. అలా తయారు చేసుకున్న రాజ్యాంగ ముసాయిదాను 26 నవంబరు 1949న రాజ్యాంగ సభ ఆమోదించిందని తెలిపారు. జనవరి 26, 1950న భారతదేశం అధికారికంగా గణతంత్ర రాజ్యమైందని, ఆరోజు నుంచి భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిందని తెలిపారు. రాజ్యాంగం ఆమోదం పొంది నేటికి 76 ఏళ్లు పూర్తయిందని ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

రాజ్యాంగంలోని పీఠికను ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకోవాలని, ముఖ్యంగా యువత ప్రజాస్వామ్యం (Democracy)లో పాల్గొనడానికి రాజ్యాంగం తప్పనిసరిగా చదవాలని సూచించారు. అనంతరం.. భారతీయ జీవన గమనాన్ని ప్రతిబింబించే విలువైన సాధనం రాజ్యాంగం అన్నారు. రాజ్యాంగం, న్యాయ చట్టాల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ తోపాటు కలెక్టరేట్ సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
