వసతి గృహంపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

వసతి గృహంపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ పట్టణంలోని శివనగర్ ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని బుధవారం రాత్రి 10 గంటలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా సందర్శించారు. వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థుల హాజరు వివరాలను రికార్డులతో సరిపోల్చి పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి నాణ్యత పై ఆరా తీశారు. బియ్యం బస్తాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని పరిశీలించడంతో పాటు బియ్యం స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. నిల్వ ఉంచిన కూరగాయలను కూడా పరిశీలించి వాటి నాణ్యతను పరిశీలించారు.
మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, స్నాక్స్ సమయానికి, సరైన ప్రమాణాలతో అందుతున్నాయా లేదా అనే అంశం పై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా కంప్లైంట్ బాక్స్‌లో తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా క్రమశిక్షణతో చదువుకోవాలని ప్రోత్సహించారు. వసతి గృహంలో విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక ట్యూటర్‌ను నియమించి అదనపు పాఠాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత, హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
