రైతులకు జిల్లా కలెక్టర్ ఏ. సిరి అవగాహన…

తుగ్గలి, ఆంధ్రప్రభ : రైతులు సాగుచేసిన ప్రతి పంటను తప్పనిసరిగా ఈ-క్రాప్ లో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులకు తెలిపారు. మంగళవారం రాతన గ్రామంలో రైతులు ఉల్లి గ్రేడింగ్ చేస్తున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మాట్లాడుతూ ప్రతి రైతు తమ పంట వివరాలను తప్పనిసరిగా ఈ-క్రాప్ యాప్ ద్వారా నమోదు చేయించుకోవాలని తెలిపారు. తద్వారా పంటల బీమా, ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు.

రైతులతో నేరుగా మాట్లాడుతూ పంటల వ్యయాలు, మార్కెట్ పరిస్థితులు, ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఉల్లి పంట సాగు ఎకరాకు సుమారు రూ.75 వేల నుండి రూ.1 లక్ష వరకు ఖర్చు అవుతుందని రైతులు తెలిపారు.రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.

మండల పరిధిలో మొత్తం 21 వేల మంది రైతులు 25 వేల హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారని, అందులో ప్రధానంగా కందులు, సజ్జలు, పత్తి, టమోటా, ఉల్లి పంటలు ఉన్నాయని తెలిపారు. అలాగే, ఉల్లి పంట విషయంలో 941 మంది రైతులు 2051 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేస్తున్నారని, మండల వ్యవసాయ శాఖ అధికారి సురేష్ బాబు కలెక్టర్ కు వివరించారు.

పంటలసాగులో రైతుల శ్రద్ధ, కష్టపడి పనిచేసే తీరును కలెక్టర్ ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పంటల సాగును వంద శాతం ఈ-క్రాప్‌లో నమోదు చేయాలని, రైతులకు అవగాహన కల్పించి, సకాలంలో ఈ క్రాప్ నమోదు జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.

కార్యక్రమంలో ఆత్మ ప్రాజెక్ట్ మాజీ డైరెక్టర్ మాజీ సర్పంచ్ మనోహర్ చౌదరి, ఆర్డీఓ భరత్ నాయక్, తహసిల్దార్ రవి, ఎంపీడీవో విశ్వ మోహన్, వ్యవసాయ అధికారి సురేష్ బాబు, డిప్యూటీ ఎంపీడీవో ఎంపీడీవో పి. శ్రీహరి, వీఆర్వో నాగేంద్ర, పంచాయతీ కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply