రూ.103.82 కోట్లు

  • కర్నూలు జిల్లాలో నవంబర్ నెల పెన్షన్ల పంపిణీ

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద కర్నూలు జిల్లాలో నవంబర్ నెలకు గాను అర్హత కలిగిన 2,37,904 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.103.82 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. శనివారం ఉదయం పంచలింగాల గ్రామంలో నిర్వహించిన పథకం పంపిణీ కార్యక్రమంలో భాగంగా నూర్జబి, బోయ పద్మావతి (వితంతువులు), ఖాజా హుస్సేన్, అజ్గర్ బాషా (వికలాంగులు), మహబూబ్ బాషా (వృద్ధాప్య వేతనదారుడు) లకు కలెక్టర్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి వారి నివాసాలకు వెళ్లి పెన్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలెక్టర్ వారి ఆరోగ్యం, జీవన విధానాల పట్ల ఆరా తీశారు. పెన్షన్ సమయానికి అందుతుందా అనే అంశాన్ని కూడా విచారించారు. వికలాంగుల పెన్షన్ పొందుతున్న అజ్గర్ బాషా సర్టిఫికెట్లు పోగొట్టుకున్నట్లు చెప్పడంతో, వాటిని తిరిగి జారీ చేసేలా ఎంపీడీఓకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ ప్రజలు పొలాలకు రహదారి అవసరం, మాదాసి, మదారి కురువలకు కులప్రమాణ పత్రాల మంజూరు, భూ సమస్యల పరిష్కారం వంటి అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకుని ప్రతి నెలా 1వ తేదీనే పెన్షన్లు అందే ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, రూరల్ తహసీల్దార్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply