హెల్మెట్ వాహనదారులకు రక్షణ కవచం

హెల్మెట్ వాహనదారులకు రక్షణ కవచం
కుబీర్ లో 35 మంది వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ
కుబీర్ లో యువకులు వాహనదారులతో బైక్ ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ
కుభీర్, ఆంధ్రప్రభ : వాహనదారులు కొద్ది దూరమే వెళ్తున్నామని చాలా వరకు హెల్మెట్లు ధరించడం లేదని, ఈ స్వల్ప నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తోందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో “రోడ్డు ప్రమాదాల నివారణపై వాహనదారులకు అవగాహన” కార్యక్రమంలో భాగంగా కుబీర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన యువకులతో బైక్ ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు.
అంతకుముందు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని 35 మంది బైకర్లకు ఉచితంగా హెల్మెట్లను అందజేసి మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులకు రక్షణ కవచం హెల్మెట్ అన్నారు. రోడ్ల పైన మనం జాగ్రత్తగా వెళ్తున్నా ఒక్కోసారి ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయని, ఇటువంటి పరిస్థితుల్లో హెల్మెట్ ఉన్నట్లయితే ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడవచ్చన్నారు.

రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ హెల్మెట్/సీట్ బెల్ట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, అతివేగాన్ని తగ్గించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి కీలకమైన భద్రతా నియమాలు పాటించాలి. కూడళ్ల వద్ద రోడ్డు దాటడం, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ వాడకపోవడం ప్రాణాలను రక్షిస్తుందని ఈ నిబంధనలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు.

అనంతరం కుబీర్ పోలీస్ స్టేషన్లో పలువురు సర్పంచులు, మాజీ సర్పంచ్లు, నాయకులు ఎస్పిని శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. కుబీర్ కు చెందిన ప్రముఖ శిల్ప కళాకారుడు పర్వత్వార్ సాయి శ్యాం ఎస్పీ జానకి షర్మిలకు శిల్ప ముఖచిత్రం అందజేశారు. భైంసా, నిర్మల్ ఏ ఎస్పీలు రాజేష్ మీనా, సాయి కిరణ్, భైంసా రూరల్ సీఐ ప్రవీణ్, ఆయా మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు.
