రంజాన్ తోఫా కోసం బారులు తీరిన మహిళలు

రంజాన్ తోఫా కోసం బారులు తీరిన మహిళలు

2వేల మంది నిరుపేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా పంపిణీ

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : తిరువూరు పట్టణానికి చెందిన ఆబిదా ఖాతూన్ ప్రతి ఏడాది పవిత్ర రంజాన్ మాసంలో తన భర్త ఆరీఫ్ అహ్మద్ జ్ఞాపకార్ధంగా నిరుపేద ముస్లిం సోదరులకు, మహిళలకు రంజాన్ తోఫా అందజేస్తుంటారు. ఈ ఏడాది కూడా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రంజాన్ మొదటివారం నుండి తిరువూరు పట్టణానికి చెందిన ముస్లిం మహిళలకు,ఎ. కొండూరు మండలం చీమలపాడు,కృష్ణారావు పాలెం గ్రామాలకు చెందిన నిరుపేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా అందజేశారు.

ఆదివారం తిరువూరు లోని శాంతినగర్,అశోక్ నగర్,తోళ్ల బజార్, తంగెళ్ల బీడు, చింతల కాలనీ, సుందరయ్య కాలనీ,రాజుపేట, ఒడ్డు మీద బజారు,అప్పడాల పేట, లైన్ బజార్, పాతూరు,మధిర రోడ్డు సెంటర్, ఫ్యాక్టరీ సెంటర్, బస్టాండ్ సెంటర్, బేస్తవారి బజార్, తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద ముస్లిం మహిళలు సుమారు 2వేల మందికి, చీమలపాడు,కృష్ణారావు పాలెం గ్రామాల్లోని 200 మంది నిరుపేద మహిళలు ఒక్కొక్కరికి 2 వేల విలువ చేసే చీరలు,పండుగకు కావలసిన నిత్యావసర సరుకులు జకాత్ రూపేణా ఆప్యాయత, అనురాగాలతో పంపిణీ చేస్తూ దాతృత్వాన్ని చాటుకున్నారు.

రాజుపేటలో మసీదు నిర్మాణానికి రూ 20 లక్షల సొంత నిధులతో స్థలాన్ని కొనుగోలు చేసి మసీదును నిర్మించి ప్రారంభోత్సవం చేశారు. దీంతో రాజుపేట చెందిన ముస్లిం సోదరులందరూ ఆబిదా ఖాతూన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆబిదా ఖాతూన్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ధనిక, బీద తేడా లేకుండా అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో తనకు ఉన్నదాంట్లో,తనకు తోచిన విధంగా తన భర్త జ్ఞాపకార్థం ఆర్థిక సహాయం అందజేస్తూ పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నట్లు తెలిపారు.

మానవసేవయే మాధవ సేవ అని, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు.రంజాన్ మాసంలో ఒక్క రూపాయి దానం చేస్తే వెయ్యి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలాలు లభిస్తాయన్నారు.ధనికులు పేదలకు సహాయం చేసే ఉదార గుణాన్ని అలవర్చుకొని పుణ్య ఫలాలను పొందాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లాలోనే ఇలాంటి పుణ్య కార్యక్రమాన్ని ఏ ధనవంతుడు నిర్వహించడం లేదని, ప్రతి ఏడాది ఆబిదా ఖాతూన్ ఇలాంటి పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నందుకు నిరుపేదలందరూ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply