dispute | బెల్ట్ షాపుల నిషేధంపై వివాదం

dispute | బెల్ట్ షాపుల నిషేధంపై వివాదం

  • గ్రామపంచాయతీ తీర్మానంతో కిరాణా దుకాణాల బంద్ నిర్వ‌హ‌ణ‌

dispute | ఎండపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారీపేట గ్రామంలో బెల్ట్ షాపులను నిషేధిస్తూ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా గ్రామపంచాయతీ తీర్మానం చేయడంతో వివాదం నెలకొంది. గత కొంతకాలంగా గ్రామంలోని కొన్ని కిరాణా షాపుల్లో అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగుతుండటంతో గ్రామ పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది.

నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ దర్శనాల నరేష్ ఆధ్వర్యంలో గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిలిపివేయాలని తీర్మానించింది. అయితే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కిరాణా షాపుల నిర్వాహకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామపంచాయతీ అత్యవసర సమావేశం నిర్వహించగా, నిబంధనలపై పాలకవర్గం, షాపుల యజమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

dispute

గ్రామపంచాయతీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ గ్రామంలోని కిరాణా దుకాణాల యజమానులు బంద్ పాటించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దర్శనాల నరేష్ మాట్లాడుతూ, గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం అర్హులైన కొత్త వ్యాపారులకు మాత్రమే ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేసి, కిరాణా షాపులు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ శాంతి భద్రతలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

Leave a Reply