Dial Your | కమిషనర్‌కు 34 ఫిర్యాదులు..

Dial Your | కమిషనర్‌కు 34 ఫిర్యాదులు..
- ప్రజా సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు
- కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశాలు
Dial Your | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. ఇవాళ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 34ఫిర్యాదులను ఆయన స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజలు నేరుగా తమ సమస్యలను తెలియజేసే వేదికగా ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమం ఉపయోగపడుతోందని పేర్కొన్న కమిషనర్, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది పనితీరును విభాగాధిపతులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, చట్టపరమైన నిబంధనల మేరకు సమస్యలను వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రజల్లో నగరపాలక సంస్థపై విశ్వాసం పెరిగేలా అధికారులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ ఎన్. చిన్నరాముడు, కార్యదర్శి నాగరాజు, ప్రజారోగ్య అధికారి డా. నాగ ప్రసాద్ బాబు, ఆర్ఓలు జునైద్, స్వర్ణలత, ఎంఈ మనోహర్ రెడ్డి, డిసిపి వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ సుబ్బన్న, మంజూర్ బాష తదితరులు పాల్గొన్నారు.

వచ్చిన ప్రధాన విన్నపాలు ఇవే…
షరీన్ నగర్, రామాలయం లైన్లో సీసీ రహదారి నిర్మించాలని భాను ప్రకాష్ వినతి.
సంతోష్ నగర్ పంచముఖి నగర్లో డబ్ల్యూబీఎం రహదారి నిర్మించాలని బి.అయన్న కోరారు.
ఎస్ఏపీ క్యాంపు తూర్పు ప్రవేశ మార్గం వద్ద అనధికార స్పీడ్ బ్రేకర్ల తొలగింపు కోరుతూ కేశవరావు వినతి.
పెద్దపాడు రోడ్డు గీత లక్ష్మి నగర్లో వీధి దీపాలు వెలగడం లేదని, చెత్త సేకరణ జరగడం లేదని వై. నాగరాజు ఫిర్యాదు.
ప్రకాష్ నగర్ సుంకులమ్మ గుడి వద్ద డ్రైనేజీ బ్లాక్ అయిందని ఇశాక్ అహ్మద్ విజ్ఞప్తి.
రాఘవేంద్ర నగర్లో పూడికతీత పనులు చేపట్టాలని ధనుంజయ్ అభ్యర్థన.
విజయ్ లక్ష్మి నగర్–2, కృష్ణా నగర్ 9/3లో ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని రాముడు, సుబ్రహ్మణ్యం కోరారు.
ఈ నేపథ్యంలో వచ్చిన అన్ని ఫిర్యాదులను సంబంధిత శాఖలకు అప్పగించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.
