ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా
ఏబీవీపీ డిమాండ్
నారాయణపేట ప్రతినిధి, అక్టోబర్ 27 (ఆంధ్రప్రభ ) : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) (ABVP) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. “విద్యార్థులకు రావాల్సిన వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్షిప్లను ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్లో ఉంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో విద్యార్థులకు విడుదల కావాల్సిన సుమారు రూ.8,300 కోట్ల నిధులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దాంతో కళాశాలలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులపై భారాన్ని మోపుతున్నాయి. ఉన్నత విద్యకు ప్రయత్నించే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు” అన్నారు.
అలాగే హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు లేని కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. “గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యంగా మారినా ప్రభుత్వం గాని, అధికారులు గాని పట్టించుకోవడం లేదని కేవలం పేపర్లలో ప్రకటనలకే పరిమితమైపోతున్నారు” అని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

