Dharna | కాంగ్రెస్‌ది కక్షసాధింపు రాజకీయాలే

Dharna | కాంగ్రెస్‌ది కక్షసాధింపు రాజకీయాలే

  • రాయపోల్‌లో బీఆర్‌ఎస్ రోడ్డుపై ధర్నా
  • వెంటనే రైతుల అకౌంట్ లో రైతు బందు నిధులు జమచేయాలి

Dharna | రాయపోల్, ఆంధ్ర‌ప్ర‌భ : ఫోన్‌ టాపింగ్‌ కేసు పేరుతో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్‌రావును విచారణకు పిలవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రాజకీయ కక్షసాధింపేనని బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటేశ్వరశర్మ ఆరోపించారు. ఈ మేరకు శనివారం రాయపోల్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలోగజ్వేల్ రామాయంపేట రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించి తీవ్ర నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, దశాబ్ద కాలం పాటు అభివృద్ధి పథంలో నడిపించిన మహోన్నత నాయకుడు కేసీఆర్‌పై తప్పుడు కేసులు బనాయించి ప్రజల్లో ఆయన ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు మండిపడ్డారు.ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టే చర్యగా దుయ్యబట్టారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిపై కక్షసాధింపు చర్యలు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. కేసీఆర్‌కు పార్టీ శ్రేణులు ఎప్పుడూ అండగా నిలుస్తాయని స్పష్టం చేస్తూ, అవసరమైతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి కి దమ్ముంటే రైతుల ఖాతాలో రైతు బందు నిధులు జమచేయాలన్నారు.

నిరసన సందర్భంగా రహదారిపై కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, తొగుట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లతీఫ్ అప్రమత్తంగా పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం రోడ్డుపై ధర్నా చేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సత్యనారాయణ, యాదగిరి, గణేష్, బుజ్జి, సందీప్, రవి, మురళీ, మహేష్, స్వామి, మోహన్, ఇసాకులు, నవీన్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply