ధర్మం – మర్మం : నైరుతి దిక్కుపై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

తూర్పు, ఆగ్నేయం, దక్షిణము, నైఋతి, పశ్చిమము, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యము అనే ఎనిమిది దిక్కుల అధిపతులను అష్టదిక్పాలకులుగా వ్యవహరిస్తారు.

వీరిలో నైరుతి దిక్కు అధిపతిని గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ
దక్షిణ పశ్చిమముల మధ్యభాగం నైరుతి. దీనికి అధిపతి నైరుతి లేదా నిర్‌ ఋతి. ‘ఋతి’ అనగా పీడ, వ్యాధి, అజ్ఞానము, అసత్యము, ఆక్రమణ అని అర్థము. ఇవేమీ లేనివాడు ‘నిర్‌ ఋతి’. ఇతను ‘యాదసాంపతి’ అనగా రాక్షసపతి అలాగే జలాధిపతి. రాక్షసపతి లేవకుండా ఉండాలనే కారణంతో నైరుతి భాగంలో బరువును ఉంచుట ఇప్పటికీ ఆచారం. నైరుతి భాగంలో బావిగాని గొయ్యిగాని తవ్విన యెడల జలాధిపతి అయిన నైరుతి ఆ భాగాన్ని ఆక్రమించి ఇంటికి అనర్ధము కలిగిస్తాడు. పేరుకు రాక్షసుడైనా అష్టదిక్పాలకులలో ఇతనికి దిక్పాలకత్త్వము, దేవత్వము లభించింది. బ్రహ్మ యక్షులను, రాక్షసులను సృష్టించగా వారు ఆకలిగొని సృష్టించిన బ్రహ్మనే తినటానికి యత్నించగా తాను సృష్టించిన తండ్రినని, భక్షించరాదని బ్రహ్మ వారించెను. ‘మారక్షత’ అనగా రక్షించవద్దు అని కొందరు ‘జక్షత’ అనగా రక్షించమని కొందరు అని పరుగెత్తగా ‘మారక్షత’ అన్నవారు రాక్షసులుగా ‘జక్షత’ అన్నవారు యక్షులుగా పేరుపొందారు. అదే సమయంలో దక్షిణపశ్చిమ మధ్యభాగం నుండి ఒక రాక్షసుడు ‘పితరం రక్షత సదా’ అనగా ఎప్పుడూ పితృదేవుడిని రక్షించాలని వారికి అడ్డుని లిచెను. అతని పితృ భక్తికి సంతసించిన బ్రహ్మ అతనికి దేవత్వమును ప్రసాదించి అతడు ఏ దిక్కు నుండి వచ్చాడో ఆ దిక్కుకి అతనిని అధిపతిగా నియమించెను. రాక్షసత్వము, దైవత్వము, కాఠిన్యము, పరుషత్వము, శాంతత్వము ఇతని ప్రత్యేకతలు. నైరుతి దిగ్భాగంలో దోషం ఉంటే ఇల్లు త్వరలో అన్యాక్రాంతం అవుతుంది. భూమికి, రాజ్యానికి, ఆస్తికి అధిపతి కావాలంటే నైరుతిని పూజించాలి.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *