Dhanurmasa Festival | యాదగిరికొండ, ఆంధ్రప్రభ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో పవిత్రమైన ధనుర్మాస ఉత్సవాలు డిసెంబర్ 16వ తేది 2025 నుంచి జనవరి 14వ తేది 2026 వరకు, ఒక మాసం పాటు అత్యంత వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా నిర్వహించబడుతున్నాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎన్. వెంకట్రావు తెలిపారు. ఈ పుణ్యకాలంలో స్వామి వారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన వివరించారు. ఈ ఉత్సవాలలో అత్యంత ప్రధానమైనది తిరుప్పావై కార్యక్రమం.
దీనిని ప్రతి రోజు ఉదయం గం. 4:30 నుంచి ఉదయం గం. 5:00 వరకు ఆలయ ముఖమండపం పైన ఉత్తర భాగంలో నెలకొల్పబడిన పటంలో అమ్మవారిని కొలువు చేసి, అర్చక స్వాములు వేద పఠనంతో నిర్వహిస్తారు. ఈ ధనుర్మాసం సందర్భంగా దైనిక కైంకర్యముల సమయాలలో మార్పులు చేసినట్లు ఈవో తెలిపారు. ఉదయం గం. 3:30 వరకు ముహూర్తం పూర్తి కాగా, ఉదయం గం. 4:00 నుంచి గం. 4:30 వరకు తిరువరాధన, ఆ వెంటనే ఉదయం గం. 4:30 నుంచి గం. 5:00 వరకు తిరుప్పావై సేవకాలం, ఉదయం గం. 5:00 నుంచి గం. 6:00 వరకు నివేదన కార్యక్రమం, ఉదయం గం. 6:00 నుండి గం. 7:00 వరకు నిజాభిషేకము, ఆపై ఉదయం గం. 7:00 నుంచి గం. 7:45 వరకు సర్వాలంకార దర్శనం వంటి పరంపరలు జరుగుతాయి.
అనంతరం, ఉదయం గం. 7:45 నుండి దైనందిన కైంకర్యములు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. అలాగే, ఈ ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా, జనవరి 14, 2026న వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకుని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఆ రోజున ఉదయం గం. 7:00 నుండి ఉదయం గం. 11:30 వరకు భక్తులకు పవిత్రమైన ఉత్తర ద్వార దర్శనం కల్పించబడుతుందని ఈవో తెలియజేశారు. భక్తులందరూ ఈ మాసంలో ఆలయానికి విచ్చేసి, ధనుర్మాస కైంకర్యాలలో పాల్గొని, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా కార్యనిర్వహణాధికారి ఎన్. వెంకట్రావు గారు విజ్ఞప్తి చేశారు.

