నంద్యాల బ్యూరో ఏప్రిల్ 6 ఆంధ్రప్రభ…… నంద్యాల జిల్లాలోని ప్రముఖ జ్యోతిర్లింగం పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు.
పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని క్షేత్రపరిధిలో శ్రీశైల దేవస్థానం అనుబంధ దేవాలయాల్లో శ్రీ ప్రసన్న అంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలోని రామాలయంలో శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవోపేతంగా జరిపించారు.
ఈ ఉత్సవాన్నిపురస్కరించుకొని ఉదయం సీతారాములవారికి, ఆంజనేయస్వామి వారికి ఆలయ అర్చక,వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలతో విశేషపూజలు జరిపించారు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించి తదుపరి కళ్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని ప్రత్యేక పూజలు చేపట్టారు. మహాగణపతి పూజను నిర్వహించి, కంకణం పూజ, కంకణం ధారణ, యజ్ఞోపవితధారణ,నూతన వస్త్రసమర్పణ,వరపూజ, ప్రవర పఠన,గౌరిపూజ, మాంగల్యపూజ,శ్రీ సీతాదేవి వారికి మాంగళ్య ధారణ తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో సాంప్రదాయ పద్ధతిలో సీతారాముల కల్యాణం జరిపించరు. సీతారాముల కళ్యాణ మహోత్సవం తరువాత దేవాలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
కన్నుల పండుగ జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక వేదపండితులు, పలువురు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.