దీపోత్సవ కార్యక్రమంలో..
నంద్యాల బ్యూరో, అక్టోబర్ 27 ఆంధ్రప్రభ : కార్తీకమాస ఉత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా (Nandyal District) లోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. కార్తీక సోమవారం కావటంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. క్యూ లైన్ లో ఉన్న భక్తుల కోసం ప్రత్యేకమైన వసతి సౌకర్యాలు కల్పించినట్లు కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.

లోక కల్యాణార్థం పంచమఠాల(Panchmathala) లో సోమవారం అభిషేకం, పుష్పార్చనలు చేశామన్నారు. భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలో ఈ పూజలు జరిపించారు. ఈ సంకల్పంలో దేశం, శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో తులతూగాలనీ, జనులందరూ ఆయురారోగ్యాలతో ఉండి అకాల మరణాలు రాకుండా ఉండాలనీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లక్షదీపోత్సవం – పుష్కరిణి హారతి…
కార్తికమాసం మొదటి సోమవారం సందర్భంగా సోమవారం పుష్కరిణి వద్ద దేవస్థానం లక్ష దీపోత్సం, పుష్కరిణి హారతిని చేపట్టామన్నారు. లోకకల్యాణం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అన్నారు. ఈ దీపోత్సవ కార్యక్రమంలో పుష్కరిణి ప్రాంగణమంతా కూడా దీపాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
పాతాళ గంగ వద్ద భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు…
కార్తిక మహోత్సవంలో భాగంగా అధిక సంఖ్యలో వస్తున్న భక్తులకు అనుగుణంగా పాతాళ గంగ వద్ద స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. మహిళల కోసం పురుషుల కోసం వేరువేరుగా స్నానాల గదులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే నీటి లోపలికి పోకుండా వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించినట్లు ఆయన తెలిపారు.

