ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఈరోజు రెండో శనివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. శనివారం ఉదయానికి కంపార్టుమెంట్లన్నీ నిండి బయట క్యూలైన్ లో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు వేచిఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 12-15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
అలాగే టోకెన్లు ఉన్న భక్తులకు 4-5 గంటల్లో శ్రీవారి దర్శనం కలుగుతుందని తెలిపారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో శ్రీవారి ఆలయం భక్తులతో సందడి వాతావరణం నెలకొంది.

