Devineni Avinash | తక్షణం కేసులు నమోదు చేయాలి

Devineni Avinash | తక్షణం కేసులు నమోదు చేయాలి

  • మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్
  • టీటీడీ లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారాలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్

Devineni Avinash | విజయవాడ, ఆంధ్రప్రభ : వైసీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడుల ఘటనల్లో పాల్పడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని, అలాగే టీటీడీ లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఈ రోజు విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, టీటీడీ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఆరోపించారు.

ఈ విషయంలో సీబీఐ ఇచ్చిన నివేదికలో వాస్తవాలు బయటపడ్డాయని, కూటమి నేతలు చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని ప్రజలకు స్పష్టంగా అర్థమైందని తెలిపారు. టీటీడీ లడ్డు అంశంపై నిజాలు బయటపడడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారని అవినాష్ ఆరోపించారు. అంబటి రాంబాబు ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడి చేయడం, ఇంట్లో మహిళలు ఉన్నా కూడా చూడకుండా ఇల్లు తగలబెట్టడం అన్యాయమని విమర్శించారు.

అదేవిధంగా జోగి రమేష్ ఇంటిపై కూడా అన్యాయంగా దాడి జరిగిందని, ఈ దాడులకు నారా లోకేష్, కేశినేని చిన్ని వర్గాలే కారణమని ఆరోపించారు. విజయవాడలో పెట్రోల్ బాంబుల సంస్కృతిని తీసుకొచ్చారని, ఇది రాష్ట్రంలో ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనల్లో పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని అవినాష్ ఆరోపించారు. రౌడీ షీటర్లను అదుపులో పెట్టాల్సిన పోలీసులే, వారిని రాజకీయ నాయకులకు అప్పగించి దాడులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు చేశారు. దాడి చేసిన వారు కళ్లముందే కనిపిస్తున్నా పోలీసులు చేతులు ముడుచుకుని చూస్తున్నారని అన్నారు.

పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని, దాడి చేసిన వారిని నడిరోడ్డుపై అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు రిటైర్ అయినా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు ఇప్పటికీ కోరుకుంటున్నారని అవినాష్ పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి కాల్ మనీ కేసులు, హత్యలు, అక్రమాలు, దందాలు పెరిగాయని ఆరోపించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే చట్టానికి భంగం కలిగించే వారికి తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.

టీటీడీ లడ్డు విషయంలో కూటమి నేతలు అబద్ధాలు చెప్పి ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని, దీనిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఇక మోసం చేసే పరిస్థితి లేదని, కూటమి నేతలు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు కలపాల అంబెడ్కర్, వియ్యపు అమర్నాథ్, రవి ప్రకాష్, కో-ఆప్షన్ సభ్యురాలు అలీమ్పా, పార్లమెంట్ పరిశీలకులు ఆళ్ల చెల్లారావు, డివిజన్ అధ్యక్షులు రాజేష్, ఉదయ్, అబ్బినాయుడు, మొయిన్, స్వప్న, ఇందిరా, మాగంటి నవీన్, సీతారాముడు, వైసీపీ నాయకులు నాహీద్, ధనరాజు, రాజ్ కమల్, సుభాషిణి, సునీత, రమణ, మండల అధ్యక్షులు గద్దె కళ్యాణ్, ప్రభు, సన్నీ, సాయి కృష్ణ, పంతాల సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply