నల్లగొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి : నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని బంధన్ బ్యాంక్ మేనేజర్ మహిళలను బడా మోసానికి గురిచేశారు. పొదుపు సంఘాల మహిళలు కట్టిన సుమారు 6 లక్షల రూపాయల డబ్బుతో బ్యాంకు మేనేజర్ ఉడాయించాడు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరుతూ పలువురు మహిళలు బ్యాంక్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
మోసం వెలుగు చూసిందిలా…
కోల్‌కత్తాలో హెడ్ ఆఫీస్ ఉన్న బంధన్ బ్యాంకు దేవరకొండ శాఖలో మొత్తం 104 గ్రూపులు, 1309 మంది సభ్యులు పొదుపు చేసుకున్నారు. బ్యాంకు నుండి తమ వ్యక్తిగత అవసరాల కోసం రుణాలు తీసుకొని వారం వారం డబ్బులు చెల్లించేవారు. ఈ క్రమంలో నవంబర్ 23న బంధన్ బ్యాంక్ శాఖలో కొండమల్లేపల్లి చెందిన సాయి తేజ మహిళా సంఘం పేరుతో ఒక్కొక్కరు రూ. 50,000 చొప్పున లోను తీసుకున్నారు. 5000 రూపాయలు ఖర్చులకు పోను 18 మంది సభ్యులకు ఒక్కొక్కరికి 45 వేల రూపాయలను బ్యాంకు సిబ్బంది చెల్లించారు. తీసుకున్న డబ్బులకు గాను ఒక్కో సభ్యురాలు వారానికి రూ. 1400 చొప్పున 48 వారాలు బ్యాంకు కట్టాల్సి ఉంది. బ్యాంకు నిబంధన ప్రకారం బాధితులు బ్యాంకు రికవరీ ఏజెంట్ అంజికి పూర్తి డబ్బులు చెల్లించారు. తిరిగి తమకు కొత్తలోను ఇవ్వాలని ఆరు నెలలుగా మహిళలు తిరుగుతున్నారు. మహిళలు బ్యాంకు కు వెళ్లి విచారించగా వారి పేర్లపై అప్పు ఉన్నట్లు ప్రస్తుత అధికారులు చెబుతున్నారు. దీంతో మహిళలు తమ దగ్గర డబ్బులు వసూలు చేసిన అంజిని నిలదీయగా తాను వసూలు చేసిన డబ్బులను బ్యాంకు మేనేజర్ హేమంత్ షి కి అప్పగించానని అతను డబ్బులు వాడుకున్నాడని రికవరీ ఏజెంట్ అంజి చెప్పాడు.
సస్పెన్షన్ చేసి చేతులు దులుపుకున్న అధికారులు
దేవరకొండ శాఖలో అవకతవకలు జరిగాయని గుర్తించిన బ్యాంకు ఉన్నతాధికారులు 20 రోజుల క్రితం బ్యాంకుకు వచ్చి అవకతవకలు జరిగాయని నిర్ధారించి బ్యాంక్ మేనేజర్ హేమంత్ షి, క్యాషియర్ శ్రవణ్, సిబ్బంది రమావత్ పవార్, వంగూరి ఆంజనేయులు, రమావత్ చింటూ లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. తమకు కొత్తలోనూ ఇవ్వకపోవడంతో పాటు బ్యాంకులో రూ, 1,80,000 అప్పు ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారని మహిళలు ఆరోపించారు. బ్యాంకులో అవకతవకలు జరిగాయని సిబ్బంది తమకు చెప్పకుండా వారిని సస్పెండ్ చేయడంతో బ్యాంక్ మేనేజర్ హేమంత్ షి కోల్‌కత్తాకు పారిపోయాడని మహిళలు చెప్పారు. ప్రస్తుతం ఉన్న బ్యాంకు మేనేజర్ కు తమ సమస్య గురించి చెబితే తాను కొత్తగా వచ్చానని తనకేమీ తెలియదని చెబుతున్నారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేకూరేంతవరకు ఆందోళన చేస్తామని మహిళలు బ్యాంకు ఎదుట బైఠాయించారు.
కేసు నమోదులో తాత్సారం
తమను మోసం చేసిన బంధన్ బ్యాంక్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం దేవరకొండ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధిత మహిళల నుండి పిటీషన్ తీసుకునేందుకు పోలీసులు తాత్సారం చేస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. బ్యాంకు యాజమాన్యం విచారణ జరిపి సిబ్బందిని సస్పెండ్ చేసి కాబట్టి ఈ విషయమై లోతుగా విచారణ చేపట్టి న్యాయం చేస్తామని పోలీసులు చెబుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.