తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ఉద్యోగుల జెఎసితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జెఎసి ప్రతినిధులు భట్టి విక్రమార్కకు పలు డిమాండ్లు చేశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, పెండింగ్లో ఉన్న డిఎలను మంజూరు చేయాలని, హెల్త్ కార్డులను మంజూరు చేయాలని వారు కోరారు.
జెఎసి ప్రతినిధుల డిమాండ్లకు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఐదు వేల కోట్ల బిల్స్ పెండింగ్ లో పెట్టి వెళ్లిందని అన్నారు.
గత 14 నెలల కాలంలో కొంత బకాయిలు జమ అయ్యాయని… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు పదివేల కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించిందన్నారు.
మిగిలి ఉన్న పెండింగ్ బిల్లులను రానున్న ఏప్రిల్ నుంచి ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన చెల్లిస్తాం అని హామీ ఇచ్చారు.
గత పదేళ్లలో మీరు పడిన కష్టాలను పాదయాత్రలో నేను స్వయంగా చూశాను అని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని బరోసా ఇచ్చారు.