జల సంరక్షణకు కట్టుబడి పని చేద్దాం..

జల సంరక్షణకు కట్టుబడి పని చేద్దాం..
జల్ జీవన్ మిషన్ 2.0లో జల సంరక్షణకు ప్రాధాన్యం
ప్రజల్లోనూ చైతన్యం కలిగించాలి
100 రోజుల స్పెషల్ డ్రైవ్ కు శ్రీకారం
భవిష్యత్తు తరాల కోసం నీటిని కాపాడుకోవడం తప్పనిసరి
పెనమలూరు – ఆంధ్రప్రభ : ‘జలమే జీవం… జీవమే జల సంరక్షణకు మూలం అనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలి. సాధారణ ప్రజలు ఇళ్లలో వాడే నీటిని తిరిగి భూమిలోకి పంపే చర్యలు నుంచి వాగులు, వంకలు, నదుల ద్వారా వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని కాపాడుకునే వరకు ఈ చైతన్యం అందరిలో వెల్లివిరియాల’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ఆ కాంక్షించారు. భూమి మీద మనిషికి అవసరం అయ్యే నీటి శాతం చాలా తక్కువగా ఉంది.. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేసినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వంపై ఒక రోజు వర్క్ షాపు కానూరులోని ఏపీఎస్ఐఆర్డీ భవన్ లో గురువారం ఉదయం మొదలైంది. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ “నీరు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి బాగుంటుంది. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన విధానం మెరుగవడానికి గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార వంటి నదులే జీవనాధారం. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా దేశంలో ముందు వరుసలో ఉండటానికి మనకు సమృద్ధిగా ఉన్న నీటి వనరులే కారణం. అలాంటి నీటిని సంరక్షించుకునే పెద్ద సవాల్ ఇప్పుడు మన ముందుంది.

ఉపరితల జలాలను జాగ్రత్తగా కాపాడుకోవడం, రానురాను తగ్గుతున్న భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీనిపై ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి. భవిష్యత్తును సుందరంగా నిర్మించుకోవాలంటే ప్రతి నీటి చుక్క ఎంత విలువైందో తెలుసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే నీటి సంరక్షణ చర్యలు, వృథా అయ్యే నీటిని కాపాడుకునే చర్యలను వేగవంతం చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు మనం భరోసానిచ్చినట్లు అవుతుంది.

గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థకు ఎన్నో అవరోధాలు..
ప్రతి కుటుంబానికీ తగినంత తాగు నీరు అందించాలనే ఆశయానికి క్షేత్రస్థాయిలో ఎన్నో అవరోధాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తగినంతగా – ఉపరితలంలో లభించే నీరు లభ్యత లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం కీలకమైన సమస్యలుగా ఉన్నాయి. లభ్యతగా ఉన్న నీరు కూడా ఎక్కువగా కాలుష్యం బారిన పడుతోంది.

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరి శిఖర గ్రామాల్లో వేసవిలో నీటి సమస్యను తీర్చేందుకు వాటర్ షెడ్ల పునరుద్ధరణకు ప్రణాళికలు వేస్తున్నాం. మారుతున్న సాంకేతికను ఎప్పటికప్పుడు వినియోగించుకొని నీటి కొరత తీర్చేందుకు, నీటి సంరక్షణ చర్యలు చేపట్టేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా నీటి సంరక్షణ చర్యల్లో ప్రజల భాగస్వామ్యం అవసరం.
నీటి సంరక్షణకు ప్రాధాన్యం..
ప్రతి కుటుంబానికి తగినంత తాగునీరు అందించాలనే బృహత్ సంకల్పంతో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా ముందుకు వెళ్తాం. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్గదర్శకంలో నీటి పొదుపు చర్యలు తీసుకుంటాం. జల్ జీవన్ మిషన్ 2.0 కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. నీటిని జాగ్రత్తగా వినియోగించుకునేలా, వృథా నీటిని పునర్వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన తీసుకురావడం ప్రధానం.
100 రోజుల ప్రణాళికకు శ్రీకారం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘‘100 రోజుల నీటి వినియోగ డ్రైవ్’’ అనే కార్యక్రమాన్ని ఈ ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు చేపట్టింది. దీనిలో ప్రజల్లో చైతన్యం కలిగించి భూగర్భ జలాల పెంపుదల, నీటి వృథాను అడ్డుకోవడం, నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవడం, వర్షపు నీటిని ఒడిసి పట్టడం వంటి చర్యలను తీసుకుంది. ప్రకృతిలో మన జీవనం.. జీవితం ముడిపడి ఉందనేది భారతీయ సంస్కృతికి మూలం. ప్రకృతిని కాపాడుకుంటే, ప్రకృతి మనకు మంచి చేస్తుంది.
జీవితాన్ని, ప్రకృతిని సమతుల్యం చేసుకుంటేనే భవిష్యత్తు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రకృతి ఇచ్చిన నీటి వనరులను ఉపయోగించుకోవడంలో జాగ్రత్త వహించాలి” అన్నారు. ఈ వర్క్ షాపులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కాలుష్య నియంత్రణమండలి ఛైర్మన్ డా.పి కృష్ణయ్య, ఏపీ ఎస్ఐఆర్డీ కమిషనర్ ముత్యాల రాజు, అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
