Delhi | తెలంగాణ పారిశ్రామిక రంగం మరింత అభివృద్ధి..

  • మూత బ‌డిన ప‌రిశ్ర‌మ‌ల పునఃప్రారంభం పై దృష్టి
  • కేంద్ర మంత్రి తో శ్రీధ‌ర్ బాబు భేటి

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిశారు. ఈ సంద్భంగా తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, రాష్ట్ర యువతకు వృద్ధి చెందిన ఉపాధి అవకాశాలు కల్పించడం రాష్ట్ర అభివృద్ధి అజెండాలో ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా, ఆగిపోయిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను పునరుద్ధరించడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI), భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణి ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (SIIL) వంటి కేంద్ర యూనిట్ల పునరుద్ధరణ ద్వారా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందనీ, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుతాయని మంత్రి స్పష్టం చేశారు.

ఈ అంశంపై కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్.డి. కుమారస్వామితో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమై చర్చించారు. నిలిచిపోయిన యూనిట్ల పునరుద్ధరణ వల్ల రాష్ట్రానికి వచ్చే లాభాలను వివరిస్తూ, వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను రూ.5000 కోట్లతో పునరుద్ధరించిన ఘన విజయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అదే విధంగా సీసీఐ, ఎస్‌ఐఐఎల్ యూనిట్లను తిరిగి కార్యరూపంలోకి తేవడం ద్వారా తెలంగాణ పారిశ్రామిక రంగానికి భారీ తోడ్పాటు లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ప్రయత్నాల వల్ల ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలు అందుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్టులు త్వరితగతిన ముందుకు సాగాలని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు.

Leave a Reply