పార్లమెంటులో ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ హోరాహోరీగా సాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీతో పాటు ఇండియా కూటమి సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానంగా స్పందించారు. “ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. వారు సిందూర్ మిష‌న్ ను నెరవేర్చారు. దేశ రక్షణ కోసం చేసిన ధైర్య సాహసానికి భారత సైన్యానికి సెల్యూట్ చెబుతున్నా” అని మోదీ అన్నారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ వర్షాకాల సమావేశాలు ‘భారత్ విజయ్ ఉత్సవ’కు నిదర్శనమని చెప్పారు. “దేశమంతా సైనిక విజయాన్ని జరుపుకుంటోంది. టెర్రరిస్టుల ప్రధాన కేంద్రాలపై విజయవంతమైన దాడులు చేసి దేశాన్ని గర్వపడేలా చేశారు. ఈ విజయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా… దేశమంతా కలిసికట్టుగా గౌరవించాలి,” అని సూచించారు.

ఆపరేషన్‌ సిందూర్‌ను కేవలం 22 నిమిషాల్లోనే విజయవంతంగా పూర్తి చేశామని మోదీ గర్వంగా ప్రకటించారు. “వందల సంఖ్యలో ఉగ్రవాదులను హతమర్చాం. వారి స్థావరాలను నేలమట్టం చేశాం. పాక్ అణు హెచ్చరికలు అబద్ధమని నిరూపించాం. మన సాంకేతిక ప్రతిభతో పాక్ గుండెలపై దాడి చేశాం. వారి ఎయిర్‌బేస్‌లు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నట్టే ఉన్నాయి,” అని ఆయన వివరించారు.

ప్రపంచం మద్దతు – ఎవరూ ఆపలేకపోయారు..

ప్రధాని మోదీ ప్రకారం, ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రపంచ దేశాల్లో ఎవరూ భారతదేశాన్ని నిలిపే ప్రయత్నం చేయలేదు. “అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా ‘దాడి ఆపండి’ అని చెప్పలేదు. పాకిస్థాన్‌కు మద్దతుగా ప్రకటనలు చేసిన దేశాలు కేవలం మూడు మాత్రమే,” అని వివరించారు.

“ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్థాన్ భయంతో వణికిపోయింది. భారత సైన్యం సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదులతో పాక్ సంబంధాలు బహిరంగ రహస్యంగా మారాయి. ఎవరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినా వారు మూల్యం చెల్లించక తప్పదు. మళ్లీ దాడులకు పాల్పడితే పాక్ భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా కొనసాగుతుంది – ముగిసిపోలేదు,” అని ఘాటుగా హెచ్చరించారు.

కాంగ్రెస్ విమర్శలపై ఘాటు స్పందన

ప్రధాని మోదీ, “56 ఇంచుల ఛాతీ ఎక్కడంటూ కాంగ్రెస్ నాపై చేసిన విమర్శలు అసత్యప్రచారం మాత్రమే. వారు పత్రికల్లో హెడ్లైన్లకు సరిపోతారు గానీ ప్రజల గుండెల్లో నిలబడలేరు,” అన్నారు. “ఆపరేషన్ సిందూర్ ఆపాలని ప్రపంచంలో ఏ నాయకుడూ చెప్పలేదు. మే 9న జేడీ వాన్స్ పెద్ద దాడి జరుగుతుందని హెచ్చరించగా, నేను వెంటనే స్పందించాను – బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం ఇస్తాం,” అని స్పష్టం చేశారు.

“పాకిస్థాన్ ఎవరినైనా అనుసంధానించాలన్నా, కుయుక్తులు చేపట్టాలన్నా – భారత్ ఉరకలేస్తుంది. ఎవరూ ఊరుకోరు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి పాశవికత్వానికి ప్రతీక. దానికి సమాధానంగా సైన్యం తీసుకున్న చర్యలు భారత సాహసానికి నిదర్శనం” అని అన్నారు.

Leave a Reply