Delhi | హస్తినలో ధూంధాంగా లాల్ దర్వాజ బోనాలు..

  • విదేశీయులను సైతం ఆకట్టుకున్న తెలంగాణ సంస్కృతీ శోభ.

న్యూ ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజా బోనాలు రెండో రోజు ధూంధాంగా జరిగాయి. నిన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు వర్మ చేతుల మీదుగా ప్రారంభమైన లాల్ దర్వాజ బోనాల రెండవ రోజు ఉత్సవాల్లో భాగంగా నేడు ఇండియా గేట్ నుండి తెలంగాణ భవన్ వరకు మహంకాళి అమ్మవారి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో, సాంస్కృతిక నృత్యాల మధ్య అత్యంత అట్టహాసంగా నిర్వహించబడింది.

ముందుగా సింహవాహినీ ఆలయ కమిటీ సభ్యులు ఇండియా గేట్ వద్ద అమ్మవారికి ప్రత్యేక వూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా.శశాంక్ గోయల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

అనంతరం 150 మంది సాంస్కృతిక శాఖ కళాకారుల సంప్రదాయ పూర్వక డప్పుల మోతలు, పోతురాజుల ఆటలు, ఒగ్గుడోలు కళాకారుల నాట్యాలు, పూర్ణ కుంభాల మధ్య సాగిన అమ్మ వారి ఊరేగింపు ఇండియా గేట్ వద్ద ఉన్న వివిధ రాష్ట్రాల ప్రజలతో పాటు అక్కడకు వచ్చిన విదేశీయులను సైతం విశేషంగా ఆకర్షించింది.

పలువురు విదేశీయులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షిస్తూ, బోనాల పండుగ వైభవాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో బంధించడమే కాదు, తెలంగాణ కళారూపాలపై ప్రశంసలు కురిపించారు.

తెలంగాణ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో పాల్గొనడం, కళాకారుల వాయిద్యాలతో కూడిన సాంస్కృతిక నృత్యాలు, పోతురాజుల ఆటలతో తెలంగాణ భవన్ వాతావరణం ఉత్సాహ భరితంగా మారింది.

Leave a Reply