Delhi Election Results – మరి కొద్దిసేపట్లో తేలనున్న అప్, బీజేపీ భవితవ్యం
ఢిల్లీ అధికార పీఠం ఎవరికి దక్కుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటల నుంచి 19 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రారంభం కానుంది. హస్తినలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికల్లో 60.54 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
పోలింగ్ ఆసక్తిగా జరగడంతో.. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల్లో ఏది గెలుస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. కౌంటింగ్ కోసం పూర్తి ఏర్పాట్లు చేశామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) అలిస్ వాజ్ తెలిపారు. సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, సహాయక సిబ్బంది మొత్తం 5 వేల మందిని నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్ మొదలయ్యే ముందు ప్రతీ నియోజకవర్గం నుంచి ర్యాండమ్‌గా 5 వీవీ పాట్లను లెక్కించి, ఈవీఎం ఓట్లతో పోల్చి చూస్తారు. అంతా కరెక్టుగా ఉంటేనే.. కౌంటింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల లోగా కౌంటింగ్ పూర్తవుతుందని అంచనా. ఫలితాలను కూడా ఇవాళే ప్రకటిస్తారు.
లెక్కల్లో ఢిల్లీ:
మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి డిసెంబర్ 5న ఎన్నికలు జరిగాయి. మొత్తం 60.42 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సహా రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 699 మంది ఎన్నికల్లో పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్స్‌లో చాలా వరకు ఈసారి బీజేపీ గెలుస్తుంది అని తేల్చాయి. 27 ఏళ్ల తర్వాత హస్తిన పీఠం ఢిల్లీకి దక్కబోతోంది అని చెప్పాయి. ఐతే.. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ముచ్చటగా మూడోసారి గెలుపు తమదే అంటోంది, హ్యాట్రిక్ కొట్టి తీరతామంటోంది. ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉంది. ఐతే.. మరో కీలక పార్టీ కాంగ్రెస్ మాత్రం ఒకట్రెండు సీట్లకే పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో.. కాంగ్రెస్‌పై ఆశలు సన్నగిల్లాయి.
గెలవాలంటే:
అసెంబ్లీ స్థానాలు 70 కాబట్టి.. మ్యాజిక్ మార్క్ 36గా ఉంది. గత రెండుసార్లూ.. ఆప్‌కి మంచి మెజార్టీ దక్కింది. ఐతే.. ఈసారి కొన్ని సీట్లు తగ్గినా.. మెజార్టీ తగ్గకపోవచ్చు అనేది ఒక అంచనా అయితే.. గట్టిగా పోటీ ఇచ్చిన బీజేపీ.. 40కి పైగా సీట్లు సాధించి.. ఆప్‌కి షాక్ ఇస్తుంది అనేది మరో అంచనా. మరి కోటిన్నర మంది జనాభా తీర్పు ఏంటో ఇవాళ తేలిపోతుంది.
2015లో ఆమ్ ఆద్మీ పార్టీ.. 67 సీట్లు గెలుచుకోగా, 2020లో 62 సీట్లు గెలిచింది. బీజేపీ 1998 నుంచి ఢిల్లీలో అధికారంలో లేదు.ఆప్ ఆరోపణలు:కౌంటింగ్‌కి కొన్ని గంటల ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, బీజేపీపై ఆరోపణలు చేశారు. ఆ పార్టీ తమ ఎమ్మెల్యేలను వేటాడుతోందని అన్నారు. అంతేకాదు.. కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపైనా ప్రశ్నలు సంధించారు. ఆపరేషన్ లోటస్ జరుగుతోందనీ, బీజేపీ.. తమ అభ్యర్థులు ఒక్కొక్కరికీ.. రూ.15 కోట్ల వరకూ ఎరగా వేసి.. కొనాలని చూస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకి ఆప్‌పై కంప్లైంట్ ఇచ్చారు. దాంతో సక్సేనా.. ఏసీబీకి ఆదేశాలు ఇచ్చారు. ఏసీబీ అధికారులు.. శుక్రవారం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి.. ఆరోపణలకు ఆధారాలు చూపించాలని నోటీస్ ఇచ్చారు.
ఆప్ గెలవకపోతే:
కనీసం తాము 50 సీట్లు గెలుస్తామని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలు.. అందువల్ల ఆ పార్టీలు ఏదైనా రాష్ట్రంలో ఓడిపోయినా.. ఇతర రాష్ట్రాల్లో గెలుస్తూ.. నిలదొక్కుకుంటున్నాయి. కానీ ఆప్ పరిస్థితి వేరు. ఆ పార్టీ ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉంది. ప్రధానంగా ఢిల్లీలో 2 సార్లు భారీ మెజార్టీతో గెలిచి.. హస్తినను కంచుకోటగా మార్చుకుంది. అలాంటి చోట ఆప్ ఓడిపోతే.. అది ఆ పార్టీ మనుగడకే సమస్య కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ మార్కుకు చేరుకోలేకపోయిన బీజేపీ.. ఆ తర్వాత రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించింది. ఢిల్లీలో కూడా ప్రచారం హోరెత్తించింది. అందువల్ల కచ్చితంగా గెలిచి.. ఆప్‌ని పూర్తిగా లేకుండా చేస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అందువల్ల.. ఈ ఎన్నికలు ఆసక్తిగా మారాయి.
కీలక నేతల పోటీ ఎక్కడ?:
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, న్యూఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. 2013 నుంచి ఇక్కడ కేజ్రివాల్ గెలుస్తున్నారు.
అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లి, బెయిల్‌పై వచ్చిన మనీశ్ సిసోడియా, జంగ్‌పురా నుంచి తొలిసారి పోటీ చేశారు. బీజేపీ, తార్వీందర్ సింగ్‌ని బరిలో దింపగా.. కాంగ్రెస్, ఫర్హాద్ సూరిని పోటీగా పెట్టింది. ఆప్‌కి ఇక్కడ సపోర్ట్ ఎక్కువగా ఉండటంతో.. ఆ పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది.
ప్రస్తుత ఢిల్లీ సీఎం ఆతిషి.. కాల్కాజీ నుంచి బరిలో దిగారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్కా లాంబాను పోటిగా పెట్టింది. బీజేపీ వివాదాస్పద నేత రమేశ్ బిదూరీని బరిలో దింపింది.ఆప్ నేత అమానుతుల్లా ఖాన్ వరుసగా మూడోసారి ఓక్లా నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి అరీబా ఖాన్, బీజేపీ నుంచి ఫిర్దౌస్ ఆలమ్, మజ్లిస్ పార్టీ (AIMIM) నుంచి షిఫా ఉర్ రెహ్మాన్ బరిలో ఉన్నారు. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో.. మజ్లిస్ పోటీ పడుతోంది.
ఆప్ సీనియర్ నేత సోమనాథ్ భారతి మాల్వియా నగర్ నుంచి మూడోసారి బరిలో దిగారు. ఇదివరకు 2సార్లూ గెలిచారు. బీజేపీ నుంచి సతీశ్ ఉపాధ్యాయ, కాంగ్రెస్ తరపున జితేంద్ర కుమార్ పోటీ చేశారు