క్రీడల్లో ఓటమి విజయానికి తొలి మెట్టు

క్రీడల్లో ఓటమి విజయానికి తొలి మెట్టు

సెకండ్ ఎడిషన్ సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ముగింపు సభలో మంత్రి వాకిటి శ్రీహరి
పోటీలను తొలకిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి
రసవత్తరంగా కొనసాగిన ఫైనల్ మ్యాచ్


మక్తల్, ఫిబ్రవరి 23 (ఆంధ్రప్రభ) : మక్తల్ లో నాలుగు రోజుల పాటు జరిగిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఫైనల్లో పురుషుల విభాగంలో రంగారెడ్డి జిల్లా జట్టుపై వనపర్తి జిల్లా 20పాయింట్ల తేడాతో గెలుపొందగా, మహిళల విభాగంలో రంగారెడ్డి జిల్లా జట్టుపై జోగులాంబ గద్వాల జిల్లా జట్టు 5 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఇరు జట్ల మధ్య ఆడుతున్న తీరును మంత్రి శ్రీహరి స్వయంగా వీక్షించారు. విజేతలకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి ఈసందర్భంగా మాట్లాడుతూ… నాలుగు రోజుల పాటు మక్తల్ లో కబడ్డీ పోటీలు జరిగాయన్నారు.

33 జిల్లాల నుండి సుమారు 1200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. మక్తల్ ప్రాంతానికి కబడ్డీకి అవినాభావ సంబంధం ఉందని తెలియజేశారు. మైదానం మాత్రమే క్రీడలో ఓడినా కూడా మళ్ళీ గెలిచే కసి వచ్చేలా చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకు మానసికంగా కుంగి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడలు మాత్రమే వీటన్నిటికీ పరిష్కారం చూపగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటమి గెలుపునకు తొలి మెట్టు అని భావించాలని క్రీడాకారులకు ఆయన సూచించారు. క్రీడలపై ఆశ, శ్వాస ఉంటేనే ఉత్తమ క్రీడాకారులుగా రానిస్తారని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచాన్ని వదిలి క్రీడలపై ధ్యాస పెడితే ప్రపంచం మొత్తం మీ వైపు చూస్తుందన్నారు. మక్తల్ లో రూ.25కోట్లతో స్టేడియం త్వరలో నిర్మించబోతున్నట్లు మంత్రి తెలియజేశారు.

రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించి మక్తల్ కు పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకు స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఆటలు ఆడే సమయంలో క్రీడాకారులకు ఏదైనా గాయం అయితే వారికోసం గచ్చిబౌలిలో హాస్పిటల్ నిర్మించనున్నట్లు తెలిపారు.

మక్తల్ లో నిర్వహించిన కబడ్డీ పోటీలతో రాష్ట్రలోనే గొప్ప పేరు వచ్చిందని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. నాలుగు రోజుల పాటు క్రీడా కారులకు అన్ని వసతులు కల్పించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కబడ్డీ పోటీలను విజయవంతం చేసిన అధికారులను ఈ సందర్బంగా మంత్రి వాకిటి శ్రీహరి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో డి వై ఎస్ ఓ శెట్టి వెంకటేష్ ,మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్, మాజీ జడ్పీటీసీ జి.లక్ష్మారెడ్డి,కాంగ్రెస్ నాయకులు బి. గణేష్ కుమార్,జి. నీలప్ప ,మున్సిపల్ కౌన్సిలర్లు వెంకటేశ్వర్లు ,అలుకూరి పావని , నాయకులు రాజప్పగూడ, ఆనంద్ గౌడ్ ,బో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply