హంద్రీ బ్రిడ్జిపై మృత్యు విరుచుకుపాటు..

హంద్రీ బ్రిడ్జిపై మృత్యు విరుచుకుపాటు..
- ఒకే రాత్రిలో రెండు ప్రమాదాలు.
- ఇద్దరు మృతి, పలువురికీ గాయాలు.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు నగర సమీపంలోని జాతీయ రహదారి-44పై హంద్రీ బ్రిడ్జి వద్ద బుధవారం అర్ధరాత్రి వరుస ప్రమాదాలు సంభవించి మృత్యువు అట్టహాసం చేసింది. క్షణాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంగా దూసుకొచ్చిన లారీ బీభత్సంతో ఘటనాస్థలం రక్తసిక్తమైంది.
మొదటి ప్రమాదం… గుర్తుతెలియని వాహనం ఢీ
రాత్రి సుమారు 11:59 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న హైవేపై చెన్నమ్మ సర్కిల్ దాటి హంద్రీ బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని వాహనం ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు.
రెండో ప్రమాదం… మృత్యు శకటంగా లారీ
మొదటి ప్రమాదంపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్న సమయంలోనే మరో దారుణం చోటుచేసుకుంది. అదే మార్గంలో అతివేగంగా వచ్చిన లారీ నియంత్రణ కోల్పోయి నేరుగా అక్కడున్న వారిపైకి దూసుకెళ్లింది. విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రఫీక్‌తో పాటు అక్కడున్న మరికొందరిని ఢీకొంటూ లారీ బీభత్సం సృష్టించింది. అక్కడ నిలిపి ఉంచిన ఏడు ద్విచక్ర వాహనాలను కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందగా, హెడ్ కానిస్టేబుల్ రఫీక్ సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు
తక్షణ స్పందన.. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
ప్రమాద సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ సిబ్బందితో కలిసి వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న వాహనాలను, ప్రమాదానికి కారణమైన లారీని క్రేన్ సహాయంతో తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మొదటి వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక్క రాత్రిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

