హైదరాబాద్, ఆంధ్రప్రభ : కొందరి ప్రవర్తన వల్ల రోజు రోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ కుమార్తె తల్లి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు లాగేసుకుని తల్లిని దట్టమైన అడవిలో వదిలేసి వెళ్లిపోయింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరి గుండెలను పిండేస్తోంది. రెండు రోజుల క్రితం బుధవ్వను గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామ శివారులో ఉన్న దట్టమైన అడవి వద్దకు ఆమె కుమార్తె తీసుకుని వెళ్లింది. అక్కడ తల్లి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను లాగేసుకుని అదే అడవిలో తల్లిని వదిలేసింది.
రెండు రోజులుగా తిండి లేక…
తాను ఎక్కడ ఉన్నానో తెలియక తిండి తిప్పలు లేక రెండు రోజులుగా బుధవ్వ ఆ అడవి ప్రాంతంలో అటు ఇటు తిరుగుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న యువకులు ఆమెను గమనించి జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో బుధవ్వను శ్రీరాముల పల్లెలోని సఖి సెంటర్ కు తరలించారు. ఆ తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ వృద్దురాలి కథనం ప్రకారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపూర్ వీధిలో బుధవ్వ ఆమె కుమార్తె ఈశ్వరీ ఉంటున్నారు. తన కుమార్తె బంగారం తీసుకుని అడవుల్లో విడిచిపెట్టినట్లు బుధవ్వ చెప్పింది.