రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవ వేడుకలు

రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవ వేడుకలు
మార్చి 7న సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ
మహిళా ఉద్యోగులు భారీగా పాల్గొనాలి
ఏపీ జేఏసీ అమరావతి పిలుపు
విజయవాడ, ఆంధ్రప్రభ : మహిళల హక్కులు, సమానత్వం, సాధికారతపై చైతన్యం పెంపొందించే లక్ష్యంతో మార్చి 7వ తేదీ శనివారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని హెడ్ ఆఫీసులు, అలాగే జిల్లా స్థాయి కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు, పారే లక్ష్మీ, పొన్నూరు విజయలక్ష్మి, పలిశెట్టి దామోదర్ రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడ లెనిన్ సెంటర్‌లోని రెవెన్యూ భవన్‌లో మహిళా విభాగం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి కార్యక్రమం విజయవంతం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళా దినోత్సవం కేవలం ఉత్సవం మాత్రమే కాకుండా మహిళల హక్కులు, భద్రత, గౌరవం, సమాన అవకాశాలపై చైతన్యం కలిగించే ఉద్యమ దినమని తెలిపారు. మహిళలు విద్య, ఉపాధి, నాయకత్వ రంగాల్లో ముందుకు రావాలంటే ప్రభుత్వ విధానాలు బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మార్చి 4, 5 తేదీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, మార్చి 7న ప్రధాన వేడుకలకు ప్రత్యేక అనుమతి మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొంటూ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తిమ్మసర్తి నాగేశ్వరరావు, రామిశెట్టి వెంకట రాజేష్, ఏ. అర్లయ్య, మందపాటి శంకరరావు, బత్తిన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
