దళితులు ఆందోళన..

దళితులు ఆందోళన..
- గోల్డ్ మైన్స్ లో భూములు కోల్పోయే దళితులకు నష్టపరహారం ఇవ్వకపోతే కోర్టుకెళ్తాం
- తహసిల్దార్ కార్యాలయం వద్ద దళితులు ఆందోళన
తుగ్గలి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం పరిధిలోని పగిడిరాయి గ్రామ సమీపంలో ఉండే గోల్డ్ మైన్స్ లో భూములు కోల్పోయే దళితులకు తగినంత నష్ట పరిహారం గోల్డ్ మైన్స్ వారు చెల్లించకపోతే కోర్టుకు వెళతామని పగిడిరాయి గ్రామానికి చెందిన దళితులు తహసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పగిడిరాయికి చెందిన దళితులు పీఎం రంగన్న, దేవేంద్ర, రామంజి, రాజు తదితరులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం తమకు జీవనోపాధి కోసం ప్రభుత్వం భూములు ఇవ్వడం జరిగిందని, ఆ భూములో సాగు చేసుకుంటూ తాము జీవిస్తున్నామని తెలిపారు. అయితే ఆ భూములను గోల్డ్ కంపెనీకి ఇవ్వాలని రెవెన్యూ అధికారులు తమకు నోటీసులు పంపడం జరిగిందన్నారు.
దీంతో తాము వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న భూములను ఇప్పుడు గోల్డ్ మెయిన్స్ వారికి ఇస్తే తాము కుటుంబాల్ని పోషించుకొని జీవించడం ఎలా అని వారు ఆవేదన చెందారు. గతంలో బంగారు తులము రూ 30 వేలు ఉన్నప్పుడు 10 సంవత్సరాల క్రితం ఎకరా భూమి రూ 12 లక్షలకు గోల్డ్ మైన్స్ వారు కొనుగోలు చేశారని, ఇప్పుడు బంగారం రేటు రూ1.50 లక్షలు దాటిందని, అందువల్ల ప్రస్తుత మార్కెట్ ప్రకారం తమకు నష్టపరహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తగిన నష్టపరహారం ఇవ్వకపోతే తాము కోర్టుకు వెళ్లి తమ భూములను గోల్డ్ మైన్స్ కు ఇవ్వమని పేర్కొన్నారు. బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తే తాము ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధమవుతామని అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్, ఎంపీ నాగరాజు, జిల్లా కలెక్టర్, అన్ని రాజకీయ పార్టీల కు చెందిన నాయకులు తమకు సహకరించి నష్టపరారాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పించాలని దళితులు కోరారు.
