సైబర్ నేరం నుంచి వృద్ధులను కాపాడిన సీఐ..

ఉయ్యూరు, ఆంధ్రప్రభ ; ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయిన వృద్ధులను లక్ష్యంగా చేసుకొని కోట్లు కొల్లగొడుతున్న డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరం నుండి కృష్ణా జిల్లా ఉయ్యూరు టౌన్ పోలీసులు ఇద్దరు వృద్ధులను కాపాడడం జరిగింది. వివరాల్లోకెళ్తే గతంలో అకౌంటెంట్ గా మరియు టీచర్ గా పనిచేసి రిటైర్ అయిన కోటా శివశంకర్ (70) ఆయన భార్య ఇద్దరు ఉయ్యూరు టౌన్ నందు గల ఏజీ అండ్ ఎస్జి కాలేజ్ సమీపంలో నివాసం ఉంటున్నారు.
వీరికి ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నా, మీ ఆధార్ కార్డు ద్వారా 25 లక్షల మనీలాంటింగ్ జరిగిందని, దానికి సంబంధించి మీపై సుప్రీంకోర్టు నుండి అరెస్ట్ వారెంట్ జారీ అయిందని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిగా ఒకరిని వీడియో కాల్ మాట్లాడించి బ్యాంక్ అకౌంట్ ల వివరాలు, స్థిర చరాస్తులు వివరాలు అన్ని ఇవ్వాలని ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదని చెబితే వెంటనే లోకల్ పోలీస్ వారు వచ్చి అరెస్ట్ చేసి ముంబై పంపిస్తారని భయభ్రాంతులకు గురి చేశారు.

కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వారి ఆదేశాల మేరకు విస్తృతంగా జరిగిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గతంలో ఉయ్యూరులో చేపట్టిన కార్యక్రమాల ద్వారా కొద్దిపాటి అవగాహన కలిగి ఉన్న ఈ వృద్ధులు వెంటనే స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ టి.వి.వి.రామారావుకు సమాచారం అందించారు. ఆయన ఉన్నతాధికారులకు సమాచారం తెలియపరిచి వెంటనే అక్కడ చేరుకుని కొద్దిసేపు జరుగుతున్నది గమనించి ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా చెప్పబడిన నకిలీ వ్యక్తి స్క్రీన్ మీదకు రాగానే అతనితో మాట్లాడటానికి ప్రయత్నించగా, రియల్ పోలీసులను చూసిన ఫేక్ పోలీస్ వెంటనే లైన్ కట్ చేసి ఆఫ్లైన్ కి వెళ్ళిపోవడం జరిగింది.
ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది, డిజిటల్ అరెస్ట్ అనే పదం కానీ పద్ధతిగాని ఎక్కడా లేదని ముంబై క్రైమ్ బ్రాంచ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్, సిబిఐల నుండి మాట్లాడుతున్నాం మీ ఆధార్ కార్డు, సిమ్ కార్డులు మనీ ల్యాండరింగ్ లో ఇరుక్కున్నాయి లేదంటే డ్రగ్స్ రవాణాలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి సీఐ తెలిపారు. ఎవరైనా బెదిరిస్తే వెంటనే స్థానిక పోలీస్ వారికి గాని, 1930 గాని రిపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా కృష్ణాజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలియజేశారు.
