Cyber Attacks: మైక్రోసాఫ్ట్ సర్వర్‌లపై సైబర్ దాడి.. చిక్కుల్లో 100కు పైగా ప్రభుత్వ సంస్థలు

న్యూ ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడుల కేసులు నిరంతరం వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఒక పెద్ద సైబర్‌స్పైయింగ్ ఆపరేషన్ బయటపడింది. ఇందులో మైక్రోసాఫ్ట్ షేర్‌పాయింట్ సర్వర్‌లను టార్గెట్ గా చేసుకున్నారు.

ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు దాదాపు 100కు పైగా వివిధ సంస్థలు ప్రభావితమయ్యాయి. ఈ సైబర్ దాడి ఎంత ప్రమాదకరమైందంటే, గత కొన్ని రోజులుగా మైక్రోసాఫ్ట్ ఒక హెచ్చరికను జారీ చేయాల్సి వచ్చింది. తమ షేర్‌పాయింట్ సర్వర్‌లపై యాక్టివ్ దాడులు జరుగుతున్నాయని, వినియోగదారులు వెంటనే సేఫ్టీ అప్ డేట్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని అందులో పేర్కొంది.

ఈ దాడి మైక్రోసాఫ్ట్ షేర్‌పాయింట్ అనే సర్వర్ సాఫ్ట్‌వేర్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగింది. ఈ సర్వర్‌ను ప్రభుత్వాలు, పెద్ద కంపెనీలు తమ డాక్యుమెంట్లను పంచుకోవడానికి ఉపయోగిస్తాయి. ఈ దాడిని జీరో-డే ఎక్స్‌ప్లోయిట్ అని పిలుస్తున్నారు. అంటే, మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లోని ఒక లోపాన్ని హ్యాకర్లు తమకు అనుకూలంగా వాడుకుని సర్వర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ లోపం గురించి మైక్రోసాఫ్ట్‌కు ముందుగా తెలియదు, అందుకే దీనిని జీరో-డే అని అంటారు.

నెదర్లాండ్స్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ఐ సెక్యూరిటీ ఈ దాడిని మొదటగా వెల్లడించింది. వారి ప్రధాన హ్యాకర్ వైషా బెర్నార్డ్, తాను ఇంటర్నెట్‌ను స్కాన్ చేసినప్పుడు దాదాపు 100 బాధిత సంస్థలను కనుగొన్నానని చెప్పారు. ఈ స్కానింగ్‌ను వారు షాడోసర్వర్ ఫౌండేషన్ తో కలిసి నిర్వహించారు.

షోడాన్ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ డేటా ప్రకారం, దాదాపు 8,000కు పైగా షేర్‌పాయింట్ సర్వర్‌లు ప్రమాదంలో ఉన్నాయి. ఈ సర్వర్‌లలో పెద్ద పారిశ్రామిక కంపెనీలు, బ్యాంకులు, ఆడిట్ కంపెనీలు, హెల్త్‌కేర్ సంస్థలు, అమెరికాలోని కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, అంతర్జాతీయ ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.హ్యాకర్లు సిస్టమ్‌లో బ్యాక్‌డోర్‌లను సృష్టించారు. దీని ద్వారా వారు పదేపదే ఆ సిస్టమ్‌లోకి ప్రవేశించగలరు. ఈ గూఢచర్యం కేవలం డేటా దొంగతనం మాత్రమే కాదు. భవిష్యత్తులో మరింత పెద్ద దాడులకు దారి తీయవచ్చు.

మైక్రోసాఫ్ట్ తాము సెక్యూరిటీ అప్‌డేట్‌లను విడుదల చేశామని, వినియోగదారులందరూ వాటిని వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరింది. FBI, బ్రిటన్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా దీనిపై నిఘా ఉంచుతున్నాయి. ఈ దాడి వెనుక ఏ హ్యాకర్ గ్రూప్ లేదా దేశం ఉందో ఇప్పటివరకు స్పష్టంగా తెలియదు.

Leave a Reply