- అడవులను వీడి.. జనజీవన స్రవంతిలోకి..
- పెద్దపల్లి సొంత ఊరు
- మహరాష్ట్ర పోలీసులకు లొంగిపోయిన అగ్రనేత
- ఆయన బాటలో అరవై మంది సాయుధులు
- భారీ ఆయుధ సామాగ్రితో సరెండర్..
- మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : విప్లవ ప్రస్థానానికి మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ దాదా అలియాస్ భూపతి అలియాస్ అభయ్ అలియాస్ వివేక్ గుడ్‌బై చెప్పేశారు. సాయుధ పోరాటంతో రాజ్యాధికారం సాధించడం సాధ్యం కాదని, ఆయుధాలు విడిచి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమించాలన్న అభిప్రాయంతో ఉన్న మల్లోజుల 44 ఏళ్ల అజ్ఞాత వాసాన్ని వీడి ఎట్టకేలకు జన జీవన స్రవంతిలో కలిశారు. ఇటీవల అభయ్ పేరుతో మావోయిస్టులు లేఖలు విడుదల కావడం ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అటు మావోయిస్టు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ చర్చ కొనసాగింది. ఈ క్రమంలో ఆయనతోపాటే మరో 60 మంది సభ్యులు కూడా భారీ ఆయుధ సామాగ్రితో పోలీసులకు లొంగిపోవడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇది మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. పార్టీలో అంతర్గత నెలకొన్న విభేదాలే వేణు లొంగుబాటుకు కారణమయ్యాయా..? అనే చర్చ సాగుతోంది. 1956 మే 10వ తేదీన జన్మించిన వేణు బీకాం విద్యనభ్యసించారు.
వేణు అలియాస్ సోనుదాదా తలపై కేంద్ర ప్రభుత్వం రూ. ఆరు కోట్ల రివార్డును ప్రకటించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మల్లోజుల వేణు 2011 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ మిద్నాపూర్‌లో జరిగిన ఎన కౌంటర్లో హతమైన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్ జీకి సొంత తమ్ముడు కావడం గమనార్హం.
పెద్దపల్లి నుంచి…
పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మల్లోజుల మధురమ్మ, వెంకటయ్యల కుమారుడైన మల్లోజుల వేణు 1981లో తాను ఎంచుకున్న సిద్దాంతం కోసం అడవి బాట పట్టి ఏటూరు నాగారం దళం సభ్యుడిగా ఉద్యమ ప్రస్థానం ప్రారంభించారు. 1982లో మహదేవపూర్ పోలీసులు మల్లోజులను అరెస్టు చేయగా, 1983లో విడుదల కావడంతో తిరిగి దళంలోకి వెళ్లారు. 1993లో డీకేఎస్ఆర్సీ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో పొలిట్ బ్యూరో మెంబర్ పదోన్నతి లభించింది.
తల్లిదండ్రులు, అన్న అంత్యక్రియలకు దూరం..
తన తండ్రి వెంకటయ్య గతంలో మరణించినా ఎన్ కౌంటర్లో తన సోదరుడు, మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్ జీకి హతమైనా, గతంలో మాతృమూర్తి మధురమ్మ మరణించినప్పటికీ మల్లోజుల వేణు వారెవరీ అంత్యక్రియలకు సైతం దూరంగా ఉన్నారు. 44 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో అడవి బాట పట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఏనాడు ఆయన కన్న ఊరికి కాని.. పుట్టిన ఊరికి కాని అడుగు పెట్టలేదు. ప్రస్తుతం ఆయన లొంగిపోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులతోపాటు పెద్దపల్లి వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది.
అగ్ర నేతల్లో ఒకడిగా..
తన అన్న మల్లోజుల కోటేశ్వర్‌రావుతో కలిసి పీడిత, తాడిత ప్రజల కోసం ఉద్యమ బాట పట్టిన మల్లోజుల వేణు ప్రస్తుతం అగ్ర నేతల్లో ఒకరిగా ఉన్నారు. మావోయిస్టు పార్టీలో అణువణువు తెలిసిన నాయకుడిగా కొనసాగుతున్నారు. 44 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో పార్టీ విస్తరణకు ఆయన ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం మల్లోజుల మావోయిస్టు పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా, సెంట్రల్ రీజినల్ బ్యూరో సెక్రటరీ, సెంట్రల్ కమిటీ స్పోక్స్ పర్సన్ గా పనిచేస్తున్నారు.
నమ్మిన సిద్ధాంతం కోసం నాలుగు దశాబ్దాల క్రితం పెద్దపల్లికి చెందిన మల్లొ జుల వేణుగోపాల్ కన్న వారిని, ఉన్న ఊరిని విడిచి పెట్టి తుపాకీ చేతబట్టి అడవి బాట పట్టారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలతో పార్టీలో ప్రతికూల వాతావరణం నెలకొ న్నట్లు తెలుస్తోంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ వల్ల మావోయిస్టు పార్టీ అగ్రనేతలను కోల్పోవడం, మరోవైపు పార్టీలో కూడా అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మల్లోజుల వేణు అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
వేణు సహా భారీగా సభ్యుల లొంగుబాటు..!
ఇటీవల పరిణామాలతో మల్లోజు వేణుగోపాల్‌తోపాటు మావోయిస్టు పార్టీ సభ్యులు భారీగా లొంగిపోయేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలో ఏర్పడ్డ విభే దాలు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు పకడ్బందీ దాడులు నిర్వహిస్తుండడంతో మల్లోజుల లొంగిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ఇటీవల ప్రచారం జోరందుకుంది.
ఈ క్రమంలో తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్న మల్లోజుల వేణు ఏకంగా 60 మంది సభ్యులతోపాటు పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రితో గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఆయన సతీమణి విమల చంద్ర సిద్ధం 2025 జనవరి 1న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. అయితే గడ్చిరోలి పోలీసులు అధికారికంగా మావోయిస్టుల లొంగుబాటును ప్రకటించనున్నారు.
మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ..
ఆపరేషన్ కగార్, వరుసగా మావోయిస్టుల ఏరివేత నిర్బంధ చర్యలతో ఉద్యమ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా కీలక అగ్ర నేతలు లొంగిపోవడంతో ఆ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల రావు లొంగుబాటును ఛత్తీస్ గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ ధ్రువీకరించారు.
మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవడాన్ని స్వాగతిస్తున్నామని, అలా చేయకుంటే సాయుధ దళాలు సరైన పద్ధతిలో జవాబిస్తాయని పేర్కొన్నారు. నక్సలిజం అంతం కావాలని, బస్తర్ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంతోపాటు దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్‌ను ముమ్మరం చేసింది. 2026 మార్చి 31 నాటికి మవోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసుల ముందు అగ్రనేత మల్లోజుల, 60 మంది సభ్యుల లొంగుబాటు అలజడి రెపుతోంది.
పార్టీ లైన్ దాటి..
పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత విభేదాలు, కేంద్ర ప్రభుత్వ అణచివేతల క్రమంలో మల్లోజుల వేణు ఇటీవల పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇటీవలే కాల్పుల విరమణ, శాంతి చర్చల పేరుతో ఆయన అభయ్ పేరుతో కరపత్రాలు విడుదల చేయడం సంచలనం రేపింది. ఈ లేఖపై మావోయిస్టు పార్టీలో సీరియస్ గా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నట్లుగానే మల్లోజుల వేణు పోలీసులకు లొంగిపోయి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారం సాధించలేం!
సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారం సాధించలేమని మల్లోజుల వేణు భావిస్తున్నట్లు తెలిసింది. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్న యుద్ధంలో ఎంతో మంది అయాకులు ప్రాణాలు కోల్పోతున్నట్లు ఆయన వాదన. సాయుధ పోరాటాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోలేమని భావించిన వేణు ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెళ్లాలని నిర్ణయించారు. మావోయిస్టు పార్టీ అంగీకరించకపోవడంతో ఆయన మద్దతుదారులతో పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది.