- వరుస విజయాలతో ఆర్సీబీ జోష్..
- 17 ఏళ్ల లూజింగ్ స్ట్రీక్ కు తెర !
ఇండియన్ ప్రీమియ్ లీగ్ (ఐపీఎల్) 2025 లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే జట్టును 146 పరుగులకే పరిమితం చేసి, 50 తేడాతో భారీ విజయాన్ని అందుకుంది బెంగళూరు.
ఈ విజయంతో చెన్నై హోం గ్రౌండ్ చెపక్ లో దాదాపు 17 ఏళ్ల తరువాత తొలి విజయం నమోదు చేసింది ఆర్సీబీ. 2008లో ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుండి చెపాక్‌లో సీఎస్కేపై ఒకే ఒక్క విజయం సాధించిన ఆర్సీబీ.. నేటి మ్యాచ్‌తో 17 ఏళ్ల పరాజయాల పరంపరకు ఎండ్ కార్డ్ వేసింది.
ఆర్సీబీ బౌలర్ల విజృంభణ..
197 పరుగుల విజయలక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు.. ఆర్సీబీ బౌలర్లు షాకిచ్చారు. జోష్ హాజిల్‌వుడ్ (3/21), యష్ దయాల్ (2/18), లియామ్ లివింగ్‌స్టోన్ (2/28), భువనేశ్వర్ కుమార్(1/20) విజృంభించారు.
ఆర్సీబీ బౌలర్ల ధాటికి సీఎస్కే బ్యాటర్లు వచ్చిన వారు వచ్చినట్టుగా పెవిలియన్ కు క్యూ కట్టారు. రాహుల్ త్రిపాఠి (5), కెప్టెన్ రుతురాజ్(0), దీపక్ హుడా (4), సామ్ కర్రన్ (8) విఫలమయ్యారు. రచిన్ రవీంద్ర జట్టును ఆదుకునే ప్రయత్నం చేయాగా (41) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక శివం దూబే (19), జడేజా (25), అశ్విన్ (11) పరుగులకే పెవిలియన్ చేరారు. ఆఖర్లో ధోనీ (30) సిక్సులు ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు.
పాయింట్స్ టేబుల్ అప్‌డేట్
అయితే, ఈ ఓటమితో సీఎస్కే జట్టు పాయింట్స్ టేబుల్లో నాల్గవ స్థానం నుంచి 7వ స్థానానికి పడిపోయింది. మరోవైపు, ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ టోర్నమెంట్‌లో వరుసగా రెండో మ్యాచ్ గెలిచి.. పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన రన్ రేట్‌ను సాధించింది.
ఆర్సీబీ తొలి ఇన్నింగ్స్ ఇలా..
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి స్కోర్ బోర్డుపై 196 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (32), విరాట్ కోహ్లీ (31) రాణించగా.. వన్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ రిస్కీ షాట్స్ తో (14 బంతుల్లో 27) మెప్పించాడు.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సులతో 51) కీలక ఇన్నింగ్స్ ఆడి.. అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో జితేశ్ శర్మ (12), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 1ఫోర్, 3 సిక్సులతో 22) ధనాధన్ బౌండరీలు బాదారు. దీంతో ఆర్సీబీ స్కోర్ 196కు చేరింది.
చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. మతీష పతిరాణా రెండు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అశ్విన్ తలా ఒక్కవికెట్ పడగొట్టారు.