ఓఆర్ ఆర్ పరిధిలో భూముల వివరాలు అందరికీ అందుబాటులోకి తీసుకురాడానికి హైడ్రా కసరత్తు ప్రారంభించింది. చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించి సరైన హద్దులతో సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ క్రమంలో ఎన్ఆర్ఎస్సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్)తో హైడ్రా శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ డా.ప్రకాష్ చౌహాన్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించి హద్దుల విషయంలో ఎలాంటి అపోహలకు ఆస్కారం లేకుండా సరైన సమాచారం అందించడమే హైడ్రా ముందున్న లక్ష్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.
ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు ఇలా ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల సమాచారం ప్రజలకు అందుబాటులోకి తీసుకురాడానికి ఎన్ఆర్ఎస్సీతో నేడు కుదుర్చుకున్న ఒప్పందం మైలురాయి లాంటిదన్నారు.
1970వ సంవత్సరంలో సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసిన టోపో షీట్లు, కెడెస్ట్రియల్ మ్యాప్స్, రెవెన్యూ రికార్డులు, చెరువులకు సంబంధించిన సమాచారంతో పాటు ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ ఇమేజీలతో సమగ్ర సమాచారం అందుబాటులోకి తీసుకురావడమే హైడ్రా లక్ష్యమన్నారు.
చెరువుల పునరుద్ధరణ చర్యలు తీసుకున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ…
చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, పర్యావరణ హితమైన నగరాన్ని రూపొందించడానికి ఇంత పెద్దయెత్తున చర్యలు తీసుకున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడుతుందని ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ డా.ప్రకాష్ చౌహాన్ అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటే.. దేశంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ పేరుగాంచుతుందని అన్నారు. హైడ్రా చర్యలతో ఇది సాధ్యమౌతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో హైడ్రాకు పూర్తి సహకారం అందిస్తామన్నారు.