- పాయింట్స్ టేబుల్లో దూసుకొచ్చిన కేకేఆర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడింది. సొంత మైదానంలో ఫేవరెట్ గా బరిలోకి దిగిన చెన్నైకి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే నిర్ధేశించిన 104 పరుగులను కేకేఆర్.. 10.1 ఓవర్లలోనే ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో ఉన్న కేకేఆర్.. పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి దూసుకొచ్చింది.
104 పరుగుల లక్ష్య ఛేదనలో.. కోల్‌కతా ఓపెనర్ సునీల్ నరైన్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 44) దంచేశాడు. ముందుగా బౌలింగ్‌లో మూడు వికెట్లతో అదరగొట్టిన నరైన్.. బ్యాటింగ్‌లోనూ చెలరేగాడు. క్వింటన్ డి కాక్ (16 బంతుల్లో 23), కెప్టెన్ రహానే (17 బంతుల్లో 20 నాటౌట్), రింకూ సింగ్ (12 బంతుల్లో 15 నాటౌట్) రాణించారు. దాంతో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.
సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై.. అతి కష్టంమీద 9 వికెట్లకు 103 పరుగులు చేసింది. శివమ్ దూబే 31 (నాటౌట్), విజయ్ శంకర్ (29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (4), డెవాన్ కాన్వే (12) ఆదాలోలోనే పెవిలియన్ చేరారు. వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (16), రవిచంద్రన్ అశ్విన్ (1), రవీంద్ర జడేజా (0), దీపక్ హుడా (0) ఘోరంగా ఆడారు.
తొమ్మిదో స్థానంలో వచ్చిన ధోనీ కేవలం 1 పరుగు చేసి సునీల్ నరైన్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లతో రాణించాడు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు తీయగా.. మోయిన్ అలీ, వైభవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.