Srisailam |శ్రీశైలంలో భక్తుల కిటకిట..

  • సెలవు రోజులు కావడంలో శ్రీశైలంలో భక్తుల కిటకిట..
  • ఆలయ మాడవీధుల్లో భక్తుల సందడి..


నంద్యాల బ్యూరో, జులై 12, ఆంధ్రప్రభ : జ్యోతిర్లింగాలలో ఒకటైన ద్వాదశి లింగేశ్వరాలయంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నంద్యాల (Nandyala) జిల్లాలో ఉన్న శ్రీశైలం (Srisailam) భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంకు భక్తులతో పోటెత్తింది. శనివారం వేకువజామునుండే ఆలయమాడవిధుల్లో సందడి వాతావరణం నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో భక్తులు (devotees) తాకిడి అధికమైంది. శ్రీశైల పుణ్య క్షేత్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీశైలంలోని పలు పురవీధులు భక్తులతో నిండిపోయాయి.

దేవస్థానంకు అధిక సంఖ్యలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు తెల్లవారుజామున మూడు గంటలకే ఆలయద్వారాలు తెరిచారు. మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతఃకాలపూజ, మహామంగళహారతి సేవలు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి స్వామివార్ల దర్శనాలకు భక్తులకు అవకాశం కలిగించారు. వేకువజామునే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. భ్రమరాంబికా మల్లికార్జున స్వామి (Bhramarambika Mallikarjuna Swamy) వార్ల దర్శనాలకు ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. రద్దీ అధికంగా ఉండడంతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు, క్యూకాంప్లెక్, ఆర్జిత సేవాక్యూలైన్లు వేకువజామునుంచే భక్తులతో నిండిపోయాయి. భక్తులతాకిడి దృష్ట్యా స్వామిఅమ్మవార్ల దర్శనాలు, ఆర్జితసేవల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

ఉభయ దేవాలయాల నిర్వహణలో ఆయావిభాగాల అధికారులు, సిబ్బంది ప్రత్యేక విధులు నిర్వహించారు. అధిక సమయం పాటు క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్ లలో వేచిఉన్న భక్తులకు దేవస్థానం సిబ్బంది, శివసేవకులు అల్పాహారం, బిస్కెట్లు తాగునీరు పంపిణీ చేశారు. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి మూడు నుండి నాలుగు గంటలకు పైగా సమయం పట్టిందని భక్తులు పేర్కొంటున్నారు. స్వామిఅమ్మవార్ల దర్శనాంతరం భక్తులు స్వామిఅమ్మవార్ల దేవస్థానం అన్నదాన భవనంలో మహాప్రసాదాన్ని స్వీకరించి, స్వామివార్ల లడ్డుప్రసాదముల విక్రయకేంద్రాల వద్ద భక్తులు బారులుతీరారు. స్వామివార్లను సుమారు 50వేలకు పైగా భక్తులు దర్శించుకున్నట్లు అధికారుల అంచనా.

స్వామి అమ్మవార్ల దర్శనానతరం భక్తులు క్షేత్రానికి అనుసంధానమైన సాక్షిగణపతి,హఠ కేశ్వరం,పాలధార-పంచదార, శిఖరేశ్వరాలయం, ఆలయాల వద్ద భక్తులు పోటెత్తారు. అదేవిధంగా శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్న దృశ్యాలను, కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంది. ఈ వాతావరణం మరో రెండు రోజులపాటు దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు అందుకు తగిన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కార్యనిర్వాహన అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

Leave a Reply