వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని తల్లి, మతిస్థిమితం లేని అక్కను ప్రియుడితో కలిసి ఓ చెల్లి చంపేసింది. లాలాగూడ, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన ఎఫైర్ కు అడ్డొస్తుందని అక్కను చంపి మూటకట్టి ఆ మృతదేహాన్ని సంపులో పడేసి మూతపెట్టింది. రెండు రోజుల తరువాత ప్రియుడితో తన తల్లి సుశీలను హత్య చేయించింది. పోలీసులు సుశీల హత్యకేసుపై విచారణ చేస్తుండగా మతిస్థిమితం లేని అక్క మృతి ఘటన వెలుగులోకి వచ్చింది.
నార్త్ లాలాగూడ ప్రాంతానికి చెందిన సుశీలకు నలుగురు సంతానం. జ్ఞానేశ్వరి(45), లక్ష్మి (40), ఉమామహేశ్వరి(35) ముగ్గురు కూతుళ్లు, శివ(37) కుమారుడు. వీరిలో ఎవ్వరికీ వివాహం జరగలేదు. పెద్దె కుమార్తె జ్ఞానేశ్వరికి మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదు. చిన్న కూతురు ఉమామహేశ్వరి లాల్ బజార్ లో కాల్ సెంటర్ ఉద్యోగిణి. కుమారుడు శివ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. సుశీల భర్త అనారోగ్యంతో మృతిచెందడంతో అతని రైల్వే ఉద్యోగం రెండో కూతురు లక్ష్మికి వచ్చింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ లో ఇల్లు కట్టుకొని సుశీల, కూతురు ఉమామహేశ్వరి, కోడలు స్రవంతి ఉంటున్నారు. లక్ష్మి అక్క జ్ఞానేశ్వరితో రైల్వే క్వార్టర్స్ లో ఉంటుంది. అయితే, జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన అరవింద్ (45)తో వీరి కుటుంబానికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఈ క్రమంలో లక్ష్మికి అరవింద్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది.
అరవింద్ తో కలిసి తిరుగుతుండటం లక్ష్మీ కుటుంబ సభ్యులకు నచ్చేది కాదు. లక్ష్మీని పలుసార్లు వారు మందలించారు. ఈ విషయంపై ఇంట్లో పలుసార్లు గొడవలు జరిగాయి. అరవింద్ కుమార్ గురువారం సాయంత్రం జవహార్‌నగర్‌లోని సుశీల ఇంటికి వెళ్లాడు. ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సుశీల అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు ఉమా మహేశ్వరి ఇంటికొచ్చేసరికి తల్లి చనిపోయి ఉండడంతో సీసీ కెమెరాలు పరిశీలించింది. తన తల్లి సుశీలను అరవింద్‌కుమార్ చీరతో మెడకు బిగించి చంపేశాడని, మూడున్నర తులాల బంగారు నగలు ఎత్తుకెళ్ళాడని మహేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో లక్ష్మీ, అరవింద్ కుమార్ కు వివాహేతర సంబంధం ఉందని పోలీసులకు మహేశ్వరి తెలిపింది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా.. మతిస్థిమితం లేని అక్కను లక్ష్మీ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.లాలాగూడ రైల్వే క్వార్టర్స్ లో లక్ష్మీ వద్ద అరవింద్ కుమార్ ఉండే అవకాశం ఉందని భావించిన పోలీసులు అక్కడికి వెళ్లారు. లక్ష్మీని విచారించగా తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని అక్క జ్ఞానేశ్వరిని రెండు రోజుల క్రితమే హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు సంపులో చూడగా జ్ఞానేశ్వరి మృతదేహం ఉంది. మృతదేహాన్ని బయటకు తీసి గాంధీ మార్చురీకి తరలించారు. లక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరవింద్ కోసం గాలిస్తున్నారు.