నల్లగొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఓ మహిళ దారుణంగా భర్తను హతమార్చిన విషయం వెలుగులోకి వచ్చింది. మహమ్మద్ ఖలీల్ (45) ను భార్య ఆఫ్సా బేగం దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఉస్మాన్ పుర కాలనీకి చెందిన మహమ్మద్ ఖలీల్, అప్సాబేగం దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు.
ఖలీల్ చర్లపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 24వ తేదీన మహమ్మద్ ఖలీల్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడని భార్య అప్సాబేగం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కింద పడడంతో గాయాలై మృతి చెందాడని అప్సా బేగం మృతుని బంధువులను నమ్మించింది. అంత్యక్రియల సమయంలో ఖలీల్ ఒంటిపై తీవ్ర గాయాలు ఉండడంతో అనుమానించిన బంధువులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ రాజశేఖర్ రెడ్డి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఖలీల్ ది సహజ మరణం కాదని హత్యగా నిర్ధారించి రం నివేదిక అందజేశారు. దీంతో పోలీసులు ఖలీల్ భార్య అఫ్సా బేగం ను అదుపులోకి తీసుకొని విచారించగా తన భర్తను తానే హత్య చేసినట్లు అంగీకరించిందని సీఐ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఈ హత్యలో అప్సా బేగం ఒక్కతే పాల్గొందా లేక ఆమెకు మరెవరైనా సహాయం అందించారా అన్నది విచారణలో తేలాల్సి ఉంది.