క్రికెట్‌లో ప్రకాశం పటిమ…

క్రికెట్‌లో ప్రకాశం పటిమ…
ఏసీఏ సెంట్రల్ జోన్ వన్డే కిరీటం కైవసం…
ఫైనల్ లీగ్ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనతో ప్రకాశం జిల్లా చాంపియన్…
12 పాయింట్లతో అగ్రస్థానం…
రన్నరప్‌గా గుంటూరు…
వెస్ట్ గోదావరి పై 10 వికెట్ల విజయం…
కృష్ణపై గుంటూరు 6 వికెట్ల గెలుపు…
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఏసీఏ సెంట్రల్ జోన్ సీనియర్ పురుషుల వన్డే టోర్నమెంట్ 2026–27 సీజన్‌లో భాగంగా ములపాడులో నిర్వహించిన ఫైనల్ లీగ్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా ముగిశాయి. కీలక మ్యాచ్‌లలో మెరుగైన ఆటతీరుతో ప్రకాశం జిల్లా జట్టు చాంపియన్‌గా అవతరించింది.
ప్రకాశం & వెస్ట్ గోదావరి (సీపీ గ్రౌండ్)..
టాస్ గెలిచిన వెస్ట్ గోదావరి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ప్రకాశం బౌలర్ల దాడికి తట్టుకోలేక వెస్ట్ గోదావరి జట్టు 12.5 ఓవర్లలో కేవలం 23 పరుగులకే ఆల్ అవుట్ అయింది. జి. సుమిత్ 6 బంతుల్లో 9 పరుగులు చేశాడు. సులభ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ప్రకాశం జట్టు 2.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 29 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. చి. స్థిత్ 19 నాటౌట్, కె. క్రాంతి కిరణ్ 10 నాటౌట్‌గా నిలిచారు.
ఫలితం: ప్రకాశం 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

కృష్ణ & గుంటూరు (డీవీఆర్ గ్రౌండ్)..
టాస్ గెలిచిన గుంటూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కృష్ణ జట్టు 37.3 ఓవర్లలో 171 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కె. ఆర్యన్ సాయి 62 పరుగులు, వై. సందీప్ 47 పరుగులతో రాణించారు. గుంటూరు బౌలర్లలో కె. మహీప్ కుమార్ 5/35, జి. సమన్విత్ 3/22తో ఆకట్టుకున్నారు. తర్వాత బ్యాటింగ్ చేసిన గుంటూరు జట్టు 22.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి లక్ష్యాన్ని చేరుకుంది. ఎస్‌కే మహమ్మద్ 62 నాటౌట్, జి. ఆదర్శ్ సాయి 50 పరుగులు చేశారు. చి. సిద్ధార్థ 7 నాటౌట్‌గా నిలిచాడు. కృష్ణ బౌలర్లలో కె. నాని 1/3 వికెట్ తీశాడు. ఫలితం: గుంటూరు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టోర్నమెంట్ ఫలితం..
మొత్తం 12 పాయింట్లతో టేబుల్ టాప్‌లో నిలిచిన ప్రకాశం జిల్లా జట్టు ఏసీఏ సెంట్రల్ జోన్ సీనియర్ పురుషుల వన్డే టోర్నమెంట్ చాంపియన్‌గా నిలిచింది. గుంటూరు జిల్లా జట్టు రన్నరప్‌గా నిలిచింది. చాంపియన్‌గా నిలిచిన ప్రకాశం జిల్లా జట్టును జిల్లా కార్యదర్శి కె. నాగేశ్వరరావు సమక్షంలో సత్కరించారు.
