CP Sajjanar | తాగి రోడ్డెక్కితే… ఉపేక్షించేది లేదు…

CP Sajjanar | తాగి రోడ్డెక్కితే… ఉపేక్షించేది లేదు…

భారీ జ‌రిమానా… వాహ‌నాల జ‌ప్తు….


CP Sajjanar | హైదరాబాద్, ఆంధ్రప్రభ : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరవాసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (CP) స‌జ్జ‌నార్ (Sajjanar) కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మద్యం తాగి రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదన్నారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఇవాళ రాత్రి ప్రత్యేక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ఉంటాయన్నారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాలను జప్తు, జైలు శిక్ష, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుచేస్తామని తెలిపారు.

ఈ రోజు రాత్రి నగరం అంతటా 120కి పైగా కీలక పాయింట్లలో ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు (Special drunk driving checks) నిర్వహించబోతున్న‌ట్లు తెలిపాడు. ఈ తనిఖీలు కేవ‌లం ఈ రోజుకే పరిమితం కాకుండా జనవరి మొదటి వారం అంతా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ జరిమానా విధించడంతో పాటు, వాహనాన్ని సీజ్ చేస్తామని, అలాగే కోర్టు ద్వారా జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే ప్రక్రియను చేపడతామని హెచ్చరించారు.

కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమే కాకుండా అతివేగంగా వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ (Triple riding) చేయడం, బహిరంగ ప్రదేశాల్లో నలుగురికి ఇబ్బంది కలిగించేలా న్యూసెన్స్ చేయడం వంటి పనులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. మద్యం సేవించిన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించి, స్వయంగా డ్రైవింగ్ చేయకుండా క్యాబ్ సేవలను లేదా డ్రైవర్లను ఆశ్రయించాలని సూచించారు. కొత్త సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి క్షేమంగా, సంతోషంగా జరుపుకోవాలని పోలీస్ యంత్రాంగం కోరింది. ర్యాష్‌ డ్రైవింగ్ (Rash driving), బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply