హైదరాబాద్ : తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ, గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఏం చేస్తున్నట్లు..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిలదీశారు. ఎలాంటి అనుమతులు లేకుండా రూ. 80 వేల కోట్లతో నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం 50శాతం నిధులు, మిగతా 50శాతం ఎఫ్ఆర్‌బీఎం పరిధి మించి రుణ సమీకరణకు ఏపీకి అనుమతించడం అన్యాయం, అనైతికం అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. విభజన చట్టం ప్రకారం, కృష్ణా లేదా గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే రివర్ మేనజ్మెంట్ బోర్డుల అనుమతి అవసరం. కానీ అందుకు విరుద్దంగా, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే అడ్డుకోవాల్సిన కేంద్రం, నిధులిచ్చి సహకరించడం దుర్మార్గం. ఇది తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తీవ్ర అన్యాయం. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బిజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి ఏం లాభం? అని హరీశ్‌రావు నిలదీశారు
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకుంటే, ఎఫ్ఆర్‌బీఎం కింద రికవరీ పెట్టారు, కానీ బనకచర్ల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా 50శాతం ఎఫ్ఆర్‌బీఎం పరిమితి మించి రుణం తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ, ఆంధ్రప్రదేశ్‌పై వరాల జల్లులు కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు హరీశ్ రావు.
నాటి సమైక్య పాలకులు పోతిరెడ్డి పాడుతో కృష్ణా జలాల అక్రమ తరలింపుకు ప్రణాళిక వేస్తే, నేటి కాంగ్రెస్ నాయకుల సమక్షంలోనే బనకచర్ల ద్వారా గోదావరి జలాల దోపిడికి మార్గం సుగమం చేస్తున్నారు. కేంద్రాన్ని నిలదీయలేరు, ఏపీతో పోరాటం చేయలేరు. చేతగాని ప్రభుత్వం వల్ల తెలంగాణ నష్టపోయే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారాయి. నీతి అయోగ్ సమావేశానికి హాజరవుతున్న ముఖ్యమంత్రి గారూ.. ఏపీ అక్రమ ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించి, ఏపీ జల దోపిడిని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.