Corporation | రోడ్ల శుభ్రత పేరుతో ప్రమాదాలు..

Corporation | రోడ్ల శుభ్రత పేరుతో ప్రమాదాలు..
తక్షణ మార్పులు చేయాలి..
రద్దీ వేళల్లో రోడ్లపై నీరు చల్లడం తోనే..
డస్ట్ క్లీనింగ్ వాహనాలతో దుమ్ము, విజిబిలిటీ సమస్యలు..
బందరు రోడ్డులో బైక్ స్కిడ్ ఘటనపై ఆందోళనకరం..
రాత్రివేళల్లోనే శుభ్రత చర్యలు చేపట్టాలి
వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్
Corporation | విజయవాడ, ఆంధ్రప్రభ : రహదారి శుభ్రత పేరుతో విజయవాడ నగరంలో కార్పొరేషన్ సిబ్బంది చేస్తున్న పనుల కారణంగా రహదారి ప్రమాదంలో సంభవిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్ ఆందోళన వ్యక్తం. నగరంలోని సూర్యారావుపేటలోని ఉన్న తన కార్యాలయంలో శనివారం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ నగరంలో రోడ్ల శుభ్రత పేరుతో జరుగుతున్న చర్యలు ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయని విమర్శించారు. నగరపాలక సంస్థ అధికారులు కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
రద్దీగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లోనే రోడ్లపై నీళ్లు చల్లడం వల్ల ఇప్పటికే ఆయిల్ పేరుకుపోయిన రహదారులు జారుడు మార్గాలుగా మారుతున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా బందరు రోడ్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉందని, ఇటీవల ఎం అండ్ ఎం ప్రాంతంలో బైక్ స్కిడ్ అయి ఇద్దరు యువకులు గాయపడిన ఘటనను ప్రస్తావించారు. గోతుల్లో నీరు చేరడం వల్ల ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు.
అలాగే అత్యంత రద్దీ సమయంలో డస్ట్ క్లీనింగ్ వాహనాలు తిరగడం వల్ల దుమ్ము లేచి వాహనదారుల కళ్లలో పడుతోందని, దీంతో వారు సడెన్ బ్రేకులు వేయాల్సి వస్తోందని, ఇది ప్రమాదాలకు దారితీస్తోందని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్, ప్రజారోగ్య విభాగం అధికారులు వెంటనే స్పందించి రాత్రివేళల్లో మాత్రమే రోడ్ల శుభ్రత పనులు నిర్వహించాలని, ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
