Controversy | పోస్టల్ బ్యాలెట్ విధానం..
Controversy | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో (Election) పోస్టల్ బ్యాలెట్ విధానం ప్రస్తుతం తీవ్రమైన సమస్యను తెర పైకి తెస్తోంది. గ్రామాలలో ఎక్కువగా ఒక్కరు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉండటం వల్ల అతను పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడం తప్పని పరిస్థితి. కానీ ఈ విధానంలో అభ్యర్థి ఎన్నికల గుర్తు పై ఓటు వేసేందుకు స్వస్తిక్ గుర్తు బదులు ‘టిక్’ గుర్తుతో ఓటు నమోదు చేయాల్సి రావడం, రహస్య ఓటింగ్ అనే ఎన్నికల వ్యవస్థకు మూలమైన హక్కునే ప్రమాదంలో పడేస్తోంది.
ఓట్ల లెక్కింపు సమయంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల (Agents) సమక్షంలో లెక్కించడం వల్ల టిక్ గుర్తుతో వేసిన ఓటు ఆ ఉద్యోగి ఎవరికి వేశాడన్నది బహిరంగం అవుతోంది. ఈ సమాచారం బయటపడటంతో గ్రామాల్లో రాజకీయ ఒత్తిడులు, వ్యక్తిగత కక్షలు, వర్గపోర్లు పెరుగుతున్నాయి. దీని వల్ల చాలా మంది ఉద్యోగులు ఓటు వేయడానికే ముందుకు రావడంలేదు. తమ భవిష్యత్తు, తమ కుటుంబ భద్రత కోసం ఓటు హక్కును త్యజించాల్సిన పరిస్థితి రావడం ప్రజాస్వామ్యానికి గట్టి దెబ్బ.
రహస్య ఓటు హక్కు కాపాడటం ఎన్నికల సంఘం మొదటి బాధ్యత. కాబట్టి పోస్టల్ బ్యాలెట్‌లో (Postel Ballot) కూడా అందరు ఓటర్ల మాదిరిగానే ప్రభుత్వ ఉద్యోగులు కూడా స్వస్తిక్ గుర్తుతో ఓటు వేసేలా మార్పులు చేయడం ఇప్పుడు అత్యవసరం. ఇది ఉద్యోగుల భద్రతను మాత్రమే కాదు.. ఎన్నికల నిష్పాక్షికతను, గ్రామాల సామరస్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను కూడా కాపాడుతుంది. ఎన్నికల సంఘం ఈ లోపాన్ని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉంది. దీని పై ప్రభుత్వం, ఉన్నత అధికారులు అవసరమైన చర్యలు తీసుకొని తమకు కూడా స్వస్థక్ గుర్తుతో ఓటు వేసే విధంగా రహస్య ఓటింగ్ హక్కును కల్పించాలని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు.

