Constable | సౌమ్య బలిదానం వృథాగా పోనివ్వం

Constable | సౌమ్య బలిదానం వృథాగా పోనివ్వం
- ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు.. ప్రత్యేక శిక్షణకు చర్యలు
- డ్రగ్స్ కట్టడికి అంకితభావంతో పని చేస్తున్న అధికారులకు అభినందనలు
- ఎక్సైజ్ అధికారుల డైరీ ఆవిష్కరణలో మంత్రి జూపల్లి కృష్ణారావు
Constable | హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాదకద్రవ్యాల మహమ్మారిని రాష్ట్ర సరిహద్దుల వరకూ తరిమికొట్టి, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ, క్యాలెండర్లను శుక్రవారం రవీంద్రభారతిలో మంత్రి జూపల్లి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక అనర్థాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
మత్తు కోరల్లో చిక్కి ఎంతోమంది యువత భవిష్యత్తు నాశనమవుతోంది.. ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి. తలిదండ్రుల ఆశలు అడియాశలవుతున్నాయి. ఇలాంటి అరాచక శక్తులను సమాజం నుంచి ఏరిపారేయాలి. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణే మన లక్ష్యం కావాలి అని స్పష్టం చేశారు.

విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిందని గుర్తు చేశారు.
స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతో పాటు అధికారుల ఆత్మరక్షణ కోసం ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇచ్చే అంశం ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉంది. వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయుధాలను అప్పగిస్తాం అని జూపల్లి ప్రకటించారు.
అక్రమ మద్యం నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు అంకితభావంతో పని చేస్తున్న అధికారులను ఈ సందర్భంగా మంత్రి జూపల్లి అభినందించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి అధికారులు తమ శక్తివంచన లేకుండా కృషి చేయాలని, ఈ పోరాటంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అధికారుల వెంటే ఉంటుందని, అవసరమైన వనరులు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తన సహాయ సాకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అదనపు సయ్యద్ యాసిన్ ఖురేషీ, ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ సురేష్ రాథోడ్,
జాయింట్ కమిషనర్ (Enforcement ) జి.అంజన్ రావు, డిప్యూటీ కమిషనర్ జె. హరికిషన్, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సూర కృష్ణ, జనరల్ సెక్రటరీ చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
